గ్రామపంచాయతీ పాలకుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక పాలన కొనసాగుతున్నది. పంచాయతీ కార్యదర్శులు అంతా తామై పల్లెల్లో పాలనను ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వాల నుంచి సరైన నిధులు రాకపోగా గ్రామపంచాయతీల్లో ఉన్న నిధులను కూడా డ్రా చేసుకునేందుకు వీలులేకుండా ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసింది. దీంతో గ్రామాల్లో చెత్తసేకరణకు ట్రాక్టర్ల నిర్వహణ, వీధిదీపాలు, పారిశుధ్యం వంటి పనులకు కార్యదర్శులు సొంతంగా డబ్బులు ఖర్చు చేశారు. కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ మే నెల వరకు మాత్రమే బిల్లులను విడుదల చేయగా, కార్యదర్శులు చేయించిన పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయించేందుకు ప్రత్యేకాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది.
– రంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ)
ప్రత్యేక పాలనలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఇప్పటికే అప్పులు చేసి పనులు నిర్వహిస్తే.. బిల్లులు రాక గోస పడుతుంటే.. ప్రభుత్వం అదనపు పనిభారాన్ని మోపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల సర్వేతో పాటు వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం, కులగణన సర్వే చేసి, ఆన్లైన్లో పొందుపర్చే బాధ్యతనూ కార్యదర్శుల నెత్తిమీదే పెట్టింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను వివిధ శాఖల అధికారులు పరిశీలించినప్పటికీ వాటిని కంప్యూటర్లో పొందుపరిచే బాధ్యతను సెక్రటరీలకే అప్పగించింది. దీనికితోడు సకాలంలో పనులు చేయలేదంటూ మెమోలు జారీ చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నది.
జిల్లాలో 549 గ్రామపంచాయతీల్లో సుమారు 500 మందికి పైగా కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని పనుల్లో వీరే కీలక పాత్ర పోషిస్తున్నారు. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల్లో తలమునకలవుతున్నారు. ప్రతిరోజూ ఉదయం సరైన సమయానికి జీపీఎస్ అప్లోడ్ చేయలేకపోతే మెమోలు జారీ చేయడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, చెత్తసేకరణ, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, పల్లె ప్రకృతి వనాలు, వర్మీకంపోస్టుయార్డులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అందజేత, పన్నుల వసూళ్లు, పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ వంటి పనులు నిత్యకృత్యంగా ఉంటాయి. దీంతోపాటు అదనంగా ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, కులగణన సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, సర్వేకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో పొందుపర్చటం వంటివి..
అదనపు పని భారం తగ్గించి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి..
పంచాయతీ కార్యదర్శులకు అదనపు పని భారాన్ని తగ్గించాలి. నిత్యం ఉదయం లేచింది మొదలుకుని చేసే పనుల నిర్వహణతోనే సతమతమవుతున్నాం. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, కుటుంబ సర్వే అంటూ అదనపు పని భారాన్ని మోపడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రత్యేక పాలనలో పనుల నిర్వహణ కోసం అప్పులు చేశాం. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని వేడుకుంటున్నా.
– శ్రీకాంత్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు