ఆదర్శంగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాల
ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో పాటు డిజిటల్ తరగతులు
కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీ ఏర్పాటు
ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవతో అత్యాధునిక వసతులు
ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు
73 ఏండ్లుగా విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు
జిల్లాలోని సక్సెస్ పాఠశాలల్లో ఇబ్రహీంపట్నం హైస్కూల్‌కు ప్రత్యేక గుర్తింపు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28;పేరుకే అది ప్రభుత్వ పాఠశాల.. వసతుల్లో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నుతున్నది. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్, ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు వంటి అనేక సౌకర్యాలు ఈ పాఠశాల సొంతం. 73ఏండ్లుగా ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు చూరగొంటున్నది. నేటికీ ఈ పాఠశాల తన అస్తిత్వాన్ని మాత్రం కోల్పోవడంలేదు. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా, రాజకీయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదే ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యనభ్యసించడానికి పోటీపడుతుంటారు. 1949లో ఈ పాఠశాల ప్రారంభమైంది. 2010 సంవత్సరం వరకు పాత భవనంలోనే పాఠశాల కొనసాగింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇదే పాఠశాలలో విద్యనభ్యసించడంతో.. తాను చదివిన పాఠశాల రూపురేఖలు మార్చాలన్న ఉద్దేశంతో 2012లో అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించారు. పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను కూడా ఆయన కల్పించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలోనే సక్సెస్ పాఠశాలల్లో ఇబ్రహీంపట్నం హైస్కూల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
2012 నుంచి మారిన రూపురేఖలు
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2012లో నూతన భవనాలను నిర్మించిన తరువాత పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. పాఠశాలకు చుట్టూ ప్రహరీ, మధ్యలో పూలచెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదే సంవత్సరంలో పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. గతంలో ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టకముందు వందమంది విద్యార్థులుండగా.. ప్రస్తుతం 467 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో 350, తెలుగు మీడియంలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ఈ పాఠశాలలో అడ్మిషన్‌కు విద్యార్థులు పోటీపడుతుంటారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్
రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొట్టమొదటిసారిగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టంను కూడా ఏర్పాటు చేశారు. ఈ సిస్టం ద్వారా విద్యార్థులకు టెక్నాలజీలో వస్తున్న మార్పులు, కొత్త తరహా విధానాలను కూడా బోధిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అందని విద్య ఇక్కడ అందుతున్నది. దీంతో జిల్లాలోనే సక్సెస్ పాఠశాలల్లో ఇబ్రహీంపట్నం పాఠశాలకు మంచి గుర్తింపు లభించింది. గత సంవత్సరం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ఇబ్రహీంపట్నం పాఠశాలకు ప్రథమ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పాలిటెక్నిక్ విద్యలో ప్రథమ, ద్వితీయ బహుమతులను కూడా ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు సొంతం చేసుకున్నారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో..
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి తరగతి గదికి సీసీ కెమెరాలను అమర్చారు. విద్యార్థులు ప్రతి క్షణం విద్య, పాఠశాలలో క్రమశిక్షణగా మలుచుకునేలా ఈ సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయని పాఠశాల అధ్యాపకులు తెలుపుతున్నారు.
అంకితభావంతో విద్యా బోధన
ఉపాధ్యాయులంతా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కటి విద్యాబోధన అందిస్తున్నారు. కరోనా సమయంలో నిర్వహించిన డిజిటల్ తరగతుల్లో విద్యార్థులు ఇంటివద్ద విద్యనభ్యసించే విధానంపై ఇంటింటికెళ్లి పర్యవేక్షించారు.
జిల్లాలోనే ఆదర్శం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కింద పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని కూడా విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. దీనికనుగుణంగానే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందుగానే ఈ కార్యక్రమాలను తీసుకుని జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ పాఠశాలలో చదివిన ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలలో అన్ని వసతులు కల్పించారు. దీనికితోడు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాతల సహకారంతో అవసరమైన వాటిని సమకూర్చుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు కంప్యూటర్, ఇంగ్లిష్ బోధన చేస్తున్నారు. దీంతో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్‌ను తలదన్నేలా ఫలితాలను సాధించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రయోగాల్లో కూడా ఈ పాఠశాల విద్యార్థులు తమ సత్తాను చాటుతున్నారు.