వికారాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) ; జిల్లాలో అటవీ భూముల సంరక్షణకు ఆ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఫారెస్టు ల్యాండ్స్ కబ్జా కాకుండా ఫెన్సింగ్, కందకాలు ఏర్పాటు చేయడంతోపాటు కబ్జా అయిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అయితే గతంలో అటవీ భూములను కబ్జా చేసిన వారిపై పీవోఆర్(ప్రాథమిక నేర పత్రం) పూర్తి చేసి కేసులు పెట్టేవారు. దీంతో కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన జరిగేది. కబ్జా చేసిన భూముల్లో సాగు చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే ఈ విధానంతో అటవీ భూముల కబ్జాలు పెరుగుతున్న దృష్ట్యా పీవోఆర్తోపాటు కబ్జా చేసిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎక్కడైతే అటవీ భూమి కబ్జా జరిగిందో సంబంధిత గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసి కబ్జాకు పాల్పడిన అటవీ భూముల్లో మొక్కలను నాటుతున్నారు. ఒకవేళ కబ్జా చేసిన అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు అక్కడి స్థానికులు అంగీకరించకుంటే కబ్జాకు గురైన అటవీ భూములన్నింటినీ కలిపి అధికారులు ఫెన్సింగ్, కందకాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని యాలాల మండలంలోని బానాపూర్‌లో 2.20 ఎకరాలు, ధారూరు మండలంలోని దోర్నాలలో 5 ఎకరాల కబ్జా అయిన భూములను అధికారులు స్వాధీనం చేసుకొని మొక్కలు నాటారు. జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో అటవీ భూములుండగా కొంతమేర కబ్జా అయినట్లు వారు పేర్కొంటున్నారు. కబ్జాదారులు ప్రతిఏటా కొంత.. కొంత అటవీ భూమిని దున్నుతూ సాగు భూమిగా మార్చుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో 95 బ్లాకులు… 44 వేల హెక్టార్లలో అటవీ భూములున్నాయి.
మైల్వార్‌లో 200 ఎకరాలు స్వాధీనం..
తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ మండలంలోని మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వివాదం నెలకొన్నది. మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించిన సుమారు 200 ఎకరాల అటవీ భూములను గత కొన్నేండ్లుగా కర్ణాటక రాష్ర్టానికి చెందిన రైతులు కబ్జా చేసి సాగు చేసుకుంటుండగా స్థానిక రైతులు, ప్రజల ఫిర్యాదు మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై కర్ణాటక రైతులు గుల్బర్గా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో మాట్లాడినట్లు తెలిసింది. అయితే గుల్బర్గా జిల్లాకు చెందిన రెవెన్యూ, సర్వే అధికారులు మాత్రం కర్ణాటక సరిహద్దులోని భూములనే మా రాష్ట్ర రైతులు సాగు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే సరిహద్దు వివాదానికి చెక్ పెట్టేందుకు త్వరలో అక్కడ జాయింట్ సర్వే చేయనున్నారు.
ఆరువేల ఎకరాల్లో అటవీ భూములు కబ్జా..
జిల్లాలో అధిక మొత్తంలో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలోని ప్రధానమైన దామగుండం, మర్పల్లి, కండ్లపల్లి, గట్కొండాపూర్, నాగారం, తిర్మలాపూర్, నజీరాబాద్, మహ్మదాబాద్, మైల్వార్, అడికిచెర్ల తదితర ప్రాంతాల్లోని వందల ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, ధారూరు రేంజ్‌ల పరిధుల్లో సుమారు ఆరు వేల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అయితే ధారూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దొర్నాల్ ప్రాంతంలో దాదాపు వెయ్యి ఎకరాలకుపైగా, కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దాదాపు 2 వేల ఎకరాల వరకు, వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అనంతగిరిలో 100 ఎకరాలు, మదన్‌పల్లిలో వెయ్యి ఎకరాలు, ఎక్మామిడి, పుల్మామిడిలలో 500 ఎకరాలకుపైగా.. వికారాబాద్, పరిగి, ధారూరు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధుల్లోని అటవీ భూముల్లో పలు ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు వెలిసినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ భూములను తిరిగి అధికారులు స్వాధీనం చేసుకోకుండా తప్పుడు పత్రాలతో వాటి నిర్వాహకులు కోర్టులకెళ్తూ.. వాటిని తమ కబ్జాలోనే ఉండేలా వ్యవహరిస్తున్నారు.
అటవీ సంపదను కాపాడుకోవాలి..
అటవీ భూములను కబ్జా చేయడం చట్టరీత్యా నేరం. ఫారెస్టు భూములను కబ్జా చేసి చెట్లను నరుకుతూ రుజువులతో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు. గ్రామస్తులు కూడా అటవీ సంపదను కాపాడుకోవాలి.
– జ్ఞానేశ్వర్, వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి