Rangareddy | రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో నిర్దేశించిన స్థాయిలో పన్ను లు వసూలు కాకపోవడంతో నిధుల కొరత వెంటాడుతున్నది. కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిధు లు సరిపోవడం లేదు. దీంతో పన్నుల వసూ లు కోసం అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ట్యాక్స్ చెల్లించని వారికి మున్సిపాలిటీ ల నుంచి అందుతున్న తాగునీరు, పారిశుధ్యం వంటి సర్వీసులను నిలిపేయాలని భావిస్తున్నారు.
జిల్లాలో 15 మున్సిపాలిటీలు..
జిల్లాలో 15 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీల్లోనూ వసూలవుతున్న కొద్దిపాటి నిధులతో ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ చార్జీల చెల్లింపునకే సరిపోతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో మున్సిపాలిటీకి జీతభత్యాల రూపంలో ప్రతి నెలా రూ.30 నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. తాగునీరు, పారిశుధ్య పనులకు ఉపయోగించే వాహనాల డీజిల్ ఖర్చు, ఇతరత్రా ఖర్చులు కలిపి మొత్తం ఒక్కో మున్సిపాలిటీకీ నెలకు రూ.కోటి వర కు వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో పన్నుల ద్వారా వస్తున్న నిధులు పై వాటికి సరిపోతుండడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత వెంటా డుతున్నది. నగర శివారులోని అనేక మున్సిపాలిటీల్లో కొత్త కాలనీల ఏ ర్పాటు శరవేగంగా జరుగుతున్నది. పెరుగుతున్న కొత్త కాలనీలకు రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు నిధులు సరిపోవడం లేదు.
50 శాతమే వసూలు..
ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లాలో 50 శాతమే పన్ను లు వసూలయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీ నుంచి సుమారుగా రూ.ఐదు నుంచి రూ.ఆరు కోట్ల వరకు పన్నులు రావాల్సి ఉండగా అందులో సగమే వసూలయ్యాయి. నిర్దేశించిన పన్నులతోపాటు బకాయిలూ పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఒక్క ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనే ఈ ఏడాది రూ. 5 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అదనంగా మరో రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.9 కోట్ల లో రూ. 3 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ ల్లోనూ ఉన్నది. ఈ సమస్యను అధిగమించేందుకు పన్నుల వసూలే ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు.
బృందాలుగా బకాయిదారుల వద్దకు..
జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో మూడు నుంచి నాలుగు బృందాల సభ్యులు.. బకాయిదారుల వద్దకు వెళ్లనున్నారు. బకాయిలు చెల్లించని వారికి మున్సిపాలిటీల నుంచి అందే తాగునీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలను నిలిపివేయాలని నిర్ణయించారు.
మొండి బకాయిలను వసూలు చేయనున్నాం..
పన్నులు వసూలు కాకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల కటకట ఏర్పడింది. ట్యాక్స్ వసూలు కోసం నేటి నుంచి మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొండి బకాయిలను వసూలు చేయనున్నాం. పన్నులు చెల్లించని వారి ఇండ్లకు తాగునీరు కలెక్షన్ తొలగించడంతోపాటు చెత్తసేకరణ ట్రాక్టర్లనూ బంద్ చేస్తాం. ప్రజలు మున్సిపాలిటీల్లో పన్నుల చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
-రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్,ఇబ్రహీంపట్నం