బొంరాస్‌పేట, డిసెంబర్ 21 : కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పాఠశాలలు నెలల తరబడి మూతపడడంతో కొందరు విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రధానంగా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమానికి ఏటా ఒక్కో తరగతి చొప్పున మారుతున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఆంగ్ల పఠనంపై దీని ప్రభావం మరింత ఎక్కువగా పడింది. విద్యార్థుల సమగ్ర ప్రగతికి, సామర్థ్యాల పెంపునకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆగస్టు నుంచి తొలిమెట్టు కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్నది. ఇదే తరహాలో భాషా నైపుణ్యాలకు సంబంధించి పఠనాన్ని మెరుగుపర్చడానికి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి రీడింగ్ ఛాలెంజ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
అమలు తీరు ఇలా..
ప్రతి పీరియడ్‌లో పఠనానికి 10-15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నారు. దీని కోసం జిల్లాలోని కేజీబీవీల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో సీఆర్టీని ఇన్‌చార్జీగా నియమించి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. వీరు ప్రతిరోజూ చదవాల్సిన పాఠ్యాంశాన్ని సామాజిక మాధ్యమం వాట్సాప్ గ్రూప్ వేదికగా సమాచారం అందిస్తారు. దీని ప్రకారం సంబంధిత అంశాన్ని విద్యార్థినులతో చదివిస్తూ ఫోన్లో రికార్డు చేస్తారు. దీన్ని మళ్లీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేస్తారు. వీటిని ఆయా సబ్జెక్టు ఇన్చార్జీలు ప్రతిరోజూ విని ఉత్తమంగా ఉన్న పఠనాన్ని ఎంపిక చేస్తారు. దీనిని గ్రూపులో పోస్ట్ చేస్తారు. దీనివల్ల జిల్లాలో ఉత్తమంగా నిలువాలనే పోటీతత్వం విద్యార్థినులు, సబ్జెక్టు సీఆర్టీల్లో పెంపొందుతుంది.
గ్రూపులుగా విభజన, సామూహిక పఠనం
పఠనా సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థినులను మూడు గ్రూపులుగా విభజించారు. వీరిలో ధారాళంగా చదివేవారిని మొదటి కేటగిరి(టీ1)గా, మధ్యస్తంగా చదివేవారిని రెండో కేటగిరి(టీ2)గా, నెమ్మదిగా చదివేవారిని మూడో కేటగిరిగా(టీ3) విభజించారు. ప్రతిరోజూ విద్యార్థినులను మూడో విభాగం నుంచి మొదటి విభాగంలోకి మారేలా పఠనా సామర్థ్యాన్ని పెంపొందించడం ఒక సవాల్‌గా స్వీకరించి నిర్వహిస్తున్నారు. రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో అమలు చేస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమంతో ఉపయోగం
2019-2020 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను ఆంగ్ల మాధ్యమం పాఠశాలలుగా ప్రభుత్వం మార్చింది. అదే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం 9వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా.. పదో తరగతిని తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి వరకు పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమం పాఠశాలలుగా కేజీబీవీలు మారనున్నాయి. ప్రారంభించిన సంవత్సరం నుంచే కరోనా పరిస్థితులు తలెత్తడంతో విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు వెనుకబడ్డాయి. దీనిని అధిగమించడానికి అమలు చేస్తున్న రీడింగ్ ఛాలెంజ్ విద్యార్థినులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం కూడా పెరుగుతుంది.
జిల్లాలో 18 కేజీబీవీలు
వికారాబాద్ జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలోనే 8 జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయి కొనసాగుతున్నాయి. కేజీబీవీల్లో 4080 మంది, 8 కళాశాలల్లో 860 మంది విద్యార్థినులతో కలిపి 4940 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో అమలు చేస్తున్నారు.
సామర్థ్యాల పెంపునకు మంచి అవకాశం 
– రాధిక, ప్రత్యేకాధికారి, కేజీబీవీ, చెట్టుపల్లితండా
సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థులకు రీడింగ్ ఛాలెంజ్ మంచి అవకాశం. కరోనా వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలు చాలా వరకు తగ్గిపోయాయి. అందువల్ల వీరు ఈ కార్యక్రమంలో తగ్గిపోయిన సామర్థ్యాలను నేర్చుకుని మొదటి కేటగిరిలోకి వెళ్లే అవకాశం కలుగుతుంది. చదవడం, రాయడం వంటివి నేర్చుకోవడం ద్వారా సంతృప్తిగా ఉంటుంది.
చదివే సామర్థ్యం పెరుగుతుంది 
– సంధ్య, జీఈసీవో, వికారాబాద్
విద్యార్థినులను టీ1, టీ2, టీ3 గ్రూపులుగా విభజించి ప్రతిరోజూ సాయంత్రం రెండు క్లాసులు తీసుకుంటున్నారు. దీనివల్ల సామర్థ్యాలు పెరుగుతున్నాయి. వసతి గృహాల్లో మధ్యలో చేరిన కొందరు చాలా వెనుకబడి ఉన్నారు. వారికి కూడా బేసిక్స్ నేర్పుతున్నాం. రీడింగ్ ఛాలెంగ్లో గణితం సబ్జెక్టును కూడా చేర్చారు.
తప్పులు లేకుండా చదువుతున్నాం 
– నవ్యశ్రీ, 9వ తరగతి, కేజీబీవీ, చెట్టుపల్లితండా
రీడింగ్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా టీచర్లు రోజూ పాఠాలను చదివిస్తున్నారు. ప్రతిరోజూ పాఠాలను చదవడం వల్ల పదాలు, వాక్యాలను స్పష్టంగా తప్పులు లేకుండా చదువగలుగుతున్నాం.
రోజూ పాఠాలు చదివిస్తున్నారు 
– శ్రావణి, 8వ తరగతి, కేజీబీవీ, చెట్టుపల్లితండా
రీడింగ్ ఛాలెంజ్ ప్రోగ్రాం ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ఎంపిక చేసిన పాఠాలను రోజూ చదివిస్తున్నారు. దీనివల్ల చదవడం, రాయడం బాగా నేర్చుకుంటున్నాం. ధారాళంగా చదవడానికి ఇది మంచి కార్యక్రమం.