పెద్దేముల్, ఫిబ్రవరి 11 : మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుంచి ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజల నుంచి ధరణికి సంబంధించిన భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొడంగల్ : ధరణి సమస్యల పరిష్కారానికి తాసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తాసీల్దార్ బుచ్చయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే సమస్యకు సంబంధించిన భూ పత్రాలను తీసుకొచ్చి కార్యాలయంలో సిబ్బందికి దాఖలు చేసుకోవాలని తెలిపారు. సమస్య పరిష్కారంపై కార్యాలయ సిబ్బంది తగు సూచనలు, సలహాలను అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులు ధరణికి సంబంధించిన సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరారు.
దోమ : దోమ మండల ప్రజలు, భూ యజమానులు ప్రజా వాణిని సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని తహసీల్దార్ షాహెదాబేగం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దోమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆమె మండల ప్రజానికాన్ని కోరారు.
కోట్‌పల్లి : భూ సమస్యలతో సతమతం అవుతున్న రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 13 సోమవారం నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోట్‌పల్లి తహసీల్దారు అశ్పక్స్రూల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ఈనెల 13వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.