పల్లెవాసులకూ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు కృషి
వ్యాధిగ్రస్తులకు సత్వర సేవలకు అవకాశం
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం..పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానల ను ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు సబ్సెంటర్లను ఆధునీకరించి అదనపు వైద్యులతోపాటు సిబ్బందిని నియమించింది. ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏఎన్ఎంలకు ట్యాబ్లు అందించిన సర్కారు మరో అడుగు ముందుకేసి ఆశ వర్కర్లకు కూడా స్మార్ట్ఫోన్లను అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆశ వర్కర్లకూ సీఎం కేసీఆర్ 30 శాతం పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామాల్లో నిర్వహించే హెల్త్సర్వే, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసేందుకు ఇటీవల స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. జిల్లాలోని ఐదు డివిజన్లలో 1142 మంది ఆశ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా వారందరికీ స్మార్ట్ఫోన్లను జిల్లా అధికారులు పంపిణీ చేశారు. దీంతో ఆశ వర్కర్లు సేకరించిన సమాచారం ఆన్లైన్లో నిక్షిప్తం కానున్నది.
ఆరోగ్య తెలంగాణే ఇలక్ష్యంగా ముందుకు..
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఆసక్తి చూసేవారు కాదు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలు కల్పించటంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమించింది. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దడంతో వాటికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. మారుమూల గ్రామాల్లోనూ హెల్త్ సబ్సెంటర్లను ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది, ఆశవర్కర్లతో సేవలందిస్తున్నది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యం లో జిల్లాలోని ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ల ద్వారా ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు.
జిల్లాలో ఆశ వర్కర్లు 1142 మంది..
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1142 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో 233, రాజేంద్రనగర్ డివిజన్లో 128, చేవెళ్ల డివిజన్లో 187, షాద్నగర్ డివిజన్లో 288, మహేశ్వరం డివిజన్లో 306 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇప్పటికే ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. స్మార్ట్ఫోన్లలో ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు అవసరమైన శిక్షణతోపాటు ప్రత్యేక యాప్ను అందించింది. దీని ద్వారా ఆశ వర్కర్లు స్మార్ట్ఫోన్లతో ఆరోగ్య వివరాలను పొందుపర్చుతున్నారు.
సత్ఫలితాలివ్వనున్న ప్రభుత్వం నిర్ణయం
జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ప్రభుత్వం అందించిన స్మార్ట్ఫోన్లను ఇప్పటికే పంపిణీ చేశాం. గ్రామాలు, మున్సిపాలిటీ లు, పట్టణాల్లో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాల ను స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తం చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. అలాగే బీపీ, మధుమేహం, గుండె జబ్బుల గురించి ముందే స్మార్ట్ఫోన్లలో నమోదు చేస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. సర్కారు ప్రవేశపెడుతు న్న ఆరోగ్య పథకాలు కూడా అర్హులకు అందుతున్నాయా? లేదా? తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలివ్వనున్నది.
–స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్వో, రంగారెడ్డి
ప్రజారోగ్య పరిరక్షణకు సర్కారు కృషి..
ప్రజారోగ్య పరిరక్షణకు సర్కారు కృషి చేస్తున్నది. వైద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆశ వర్కర్లకు ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ఫోన్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు పలు సూచనలు, సలహాలను పొందొచ్చు.
–అభిరామ్, వైద్యాధికారి, ఎలిమినేడు