కొత్తూరు, జూలై 2 : జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. చివరకు స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. మండలంలోని సిద్ధాపూర్ సర్వేనంబర్ 252, 278, 361 సర్వే నంబర్లలలో ఉన్న 86 ఎకరాల భూమిని టీజీఐఐసీ ఎకోటౌన్ ప్రాజెక్టు కోసం జీహెచ్ఎంపీకి బదిలీ చేస్తూ గురువారం జీవో జారీ చేసింది.
ఆందోళనలు ఫలితం నిల్
తమ ప్రాంతం ఇప్పటికే పరిశ్రమలతో కాలుష్యకారకంగా మారిందని..ఇక్కడ డంపింగ్ యార్డు వద్దే..వద్దని ప్రజలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్, సిద్ధాపూర్ భూముల్లో వంటావార్పు లాంటి కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చా రు. అయినా ప్రభుత్వం ప్రజలు, ప్రజాప్రతినిధులు అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా జీవో జారీచేసిందని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెప్తారు
డంపింగ్యార్డు వద్దని కొత్తూరు, మహేశ్వరం, కేశంపే ట మండలాల ప్రజలతో కలిసి తీవ్ర ఆం దోళన కార్యక్రమా లు చేపట్టాం. కాం గ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను తీసుకొచ్చి డంపింగ్ యార్డు రావడంలేదని చెప్పించి.. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాగా, ఇప్పుడు ప్రభుత్వం డంపింగ్యార్డు ఏర్పాటు కోసం భూమిని కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. దీనికి కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెప్తారు.
-ఎమ్మె సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు