మోమిన్‌పేట, ఏప్రిల్ 8 : తెలంగాణ రాష్టంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వం అందిస్తున్న నిధులతో నేడు గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కనివిందు చేస్తున్నాయి. గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు కేసీఆర్ పరిపాలనలో కొత్తరూపు సంతరించుకుంటున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేసున్నారు.
పల్లెల్లో ప్రగతి పరుగులు
గ్రామాల్లో చెత్త సేకరణ, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా, గ్రామ వీధుల్లో నీరు నిల్వకుండా సీసీ రోడ్లు దీనికి తోడు పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటడం ప్రగతికి నాంది అని చెప్పవచ్చు. మోమిన్‌పేట మండల పరిధిలోని చీమలదరి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో ప్రణాళిక బద్ధంగా దశల వారీగా గ్రామం దినదిన అభివృద్ధి చెందుతున్నది. సర్పంచ్ ఎన్.నర్సింహారెడ్డి ప్రత్యేక కృషితో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎటు చూసినా చక్కటి సీసీ రోడ్లు, పచ్చటి మొక్కలు, 100 శాతం అండర్ డ్రైనేజీ, ప్రకృతి వనం, ముఖ్యంగా గ్రామాల్లో జరిగే లావాదేవీలు, అనుమతులు, జనన-మరణ పత్రాలు ఆన్లైన్ ద్వారా అందించడంతో సుపరిపాలన గ్రామ పంచాయతీగా అవార్డును అందుకున్నది.
జాతీయ అవార్డుకు ఎంపిక
గ్రామంలో జరిగిన అభివృద్ధికి మూడు మండల స్థాయి ఉత్తమ పంచాయతీ పురస్కారాలు, సుపరిపాలనలో రాష్ట్ర, జిల్లా స్థాయి జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు అందుకుంది. శుక్రవారం భారతదేశ ప్రభుత్వం 27 జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో 8 గ్రామ పంచాయతీలు ఎంపిక కావడం విశేషం కాగా చీమలదరి గ్రామం గుడ్ గవర్నెన్స్ పంచాయతీగా జాతీయ అవార్డుకు ఎంపికైంది.
పల్లె ప్రగతితో పచ్చదనం పరిశుభ్రత
తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతను సంతరించుకోవాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పల్లె ప్రగతితో గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు,బావులు, ముళ్ల పొదలను తొలగించి శుభ్రంగా మార్చారు. ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్త సేకరణ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ఏర్పటు చేయడంతో పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ చెత్త సేకరిస్తూ వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. హరితహారంలో నాటిన మొక్కల ఏపుగా పెరుగుతున్నాయి దీంతో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుంటుంది.
గ్రామంలో సకాల సౌకర్యాలు
ప్రభుత్వం గ్రామ పంచాయతీల అబివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులతో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, జిగేలు మంటున్న వీధి దీపాలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, ఈ- పంచాయతీ ద్వారా ధ్రువపత్రాలు అందిస్తూ చీమలదరి గ్రామాన్ని సకల సౌకర్యాల గ్రామంగా తీర్చిదిద్దారు.
ఆదర్శం ప్రకృతి వనం
జిల్లాలో ఎక్కడాలేని విధంగా చీమలదరి గ్రామంలో సర్పంచ్ ప్రకృతి వనాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు ఔషధ గుణాలు ఉన్న 30 రకాల మొక్కలను నాటించి సంరక్షిస్తున్నారు. చిన్న పిల్లలకు ఆట వస్తువులు, యువకులకు వ్యాయామ, వాలీబాల్, సెటిల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు ప్రకృతి వనం లోపల ట్రాక్ ఏర్పాటు, కాలక్షేపం కోసం బెంచీలు, ఉయ్యాల ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
నాడు చెత్తకుప్పలు, పెంట కుప్పలు, రోడ్లపై మురుగుతో గ్రామాలు అందవిహీనంగా ఉండేవి. నేడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామాలు పచ్చదనం పరిశుభ్రతతో సకల సౌకర్యాలతో అందంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న నిధులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సహకారం, వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి చీమలదరి గ్రామంలో ప్రణాళికతో దశల వారీగా గ్రామాన్ని అభివృద్ధి పరచుతున్నా. జాతీయ స్థాయిలో గుడ్ గవర్నెన్న్ పంచాయతీగా చీమలదరి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. అవార్డుగా అందించే రూ.40 లక్షల నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
– ఎన్.నర్సింహారెడ్డి, సర్పంచ్