యాలాల, సెప్టెంబర్ 17 : శివసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నాగసముందర్ గ్రామ రైతులను నిండా ముంచుతున్నది. ఈ ప్రాజెక్టును ఐదేండ్ల కిందట కాక్రవేణి నదిపై నిర్మించారు. అదేవిధంగా రెండు చెక్‌డ్యాంలను కూడా ఆ ప్రాజెక్టుపై ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా శివసాగర్ ప్రాజెక్టు నిండి బ్యాక్‌వాటర్ అధికమై…వాగుకు అవతలి వైపున ఉన్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఆ గ్రామానికి చెందిన రైతులకు దాదాపు 400 ఎకరాల వరకు పంట భూములుండడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగు నుంచి కాకుండా పక్కన ఉన్న గ్రామాల నుంచి పొలాలకు వెళ్లాలంటే 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. దీంతో అన్నదాతలు పంట పొలాలను కాపాడుకునేందుకు దాదాపుగా మూడు వేల రూపాయలను ఖర్చు చేసి డ్రమ్ములను పడవలుగా మార్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఈ విషయంలో అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రజాపాలన అని చెప్పుకొనే ప్రభుత్వం అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని, వంతెన నిర్మించి ప్రభుత్వం తమ కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
శివసాగర్ ప్రాజెక్టు వెనుక వైపు మా భూములు ఉన్నాయి. పంటను రక్షించుకునేందుకు రూ.మూడు వేలతో డ్రమ్ముల పడవను ఏర్పాటు చేసుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
– డప్పు మహేందర్, రైతు, నాగసముందర్, యాలాల
బ్రిడ్జి కట్టించి మా కష్టాలు తీర్చాలి..
శివసాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి గ్రామస్తులందరం ఇబ్బంది పడుతున్నాం. ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో వాగులో ఉన్న పొలాల వద్దకు వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. నాట్లకు కూలీలు రావడం లేదు. పాలకులు స్పందించి బ్రిడ్జి కట్టించి మా కష్టాలు తీర్చాలి.
– బోయిని లక్ష్మయ్య, రైతు, నాగసముందర్, యాలాల
కూలీలు రావడం లేదు..
మా భూములన్నీ శివసాగర్ ప్రాజెక్టు వెనుక వైపు ఉన్నాయి. వాటి వద్దకు వెళ్లాలంటే వాగును దాటాల్సిందే. పంటను సాగు చేద్దామంటే కూలీలు ఆ పొలాలకు రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా సమస్య పరిష్కరించాలి.
– చిట్టెపు పాండురంగారెడ్డి, రైతు, నాగసముందర్, యాలాల