ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. గుండాల్లో స్నానాలు చేసి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వరాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మంచాల, డిసెంబర్ 7 : మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాలు మొత్తం శివనామస్మరణతో మార్మోగాయి. గుండంలో కార్తిక స్నానాలను ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు.
భక్తులు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి ఏటా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. స్వామి దర్శనం అనంతరం దేవాలయ సమీపంలోని తులసి కోట, శివలింగం వద్ద కార్తిక దీపాలను వెలిగించి మహిళలు తమ మొక్కులను చెల్లించారు. అనంతరం వనభోజనాలు చేశారు.