ఆదిబట్ల, ఫిబ్రవరి 13 : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ముఖ్య కూడళ్లు, ప్రధాన రోడ్లపై అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కొందరు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే రేకుల పై కప్పులతో ఏకంగా షాపులనే నిర్మించి.. వాటిని వ్యాపార, వాణిజ్య సంస్థలకు అద్దెకు ఇస్తూ రూ. లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపాలిటీ ప్రతి ఏ టా రూ. లక్షల్లో రాబడిని కోల్పోతున్నది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొన్నేండ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పట్టణం నాలువైపులా విస్తరించి ఎన్నో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి.
తొమ్మిది విలీన గ్రామాలతోపాటు మున్సిపాలిటీలోని ప్రతి గ్రామానికీ రవాణా సౌకర్యం పెరిగింది. దీంతో కొన్ని ముఖ్యకూడళ్లతోపాటు ప్రధాన రోడ్ల వెంట కొందరు భవన యజమానులు స్థానిక ము న్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే యథేచ్ఛగా రేకులపై కప్పులతోపాటు షెట్టర్లు బిగిం చి వందలాది షాపులను నిర్మిస్తున్నారు. మంగళ్‌పల్లి చౌరస్తాతోపాటు బొంగులూరు నాగార్జునసాగర్ హైవేపైనా.. అలాగే, ఆదిబట్ల సమీపంలోని టీసీఎస్ సమీపంలోనూ అనుమతుల్లేకుండానే వందలాదిగా రేకుల షెడ్లతో ఏర్పాటైన షెట్టర్లు దర్శనమిస్తున్నా యి.
వాటిని వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు నెలకు రూ.ఐదు వేల నుంచి రూ. పది వేల వరకు అద్దెకిస్తూ ప్రతి ఏటా రూ. లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాగే, మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లోని ప్రధాన రోడ్లపైనా షాపులు ఏర్పాటవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను కట్ట డి చేయాల్సిన టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాల్లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నది. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు (రెసిడెన్షియల్), దుకాణాలు(కమర్షియల్) నిర్మించే ముందు స్థల యజమాని అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించి మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాతే నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక డోర్ నంబర్‌తోపాటు అసెస్మెంట్ చేయించుకుని ఏటా ఆస్తి పన్ను చెల్లించాలి.
తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం..
మున్సిపాలిటీలోని అక్రమ షెడ్ల నిర్మాణంపై తనిఖీలు నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ రేకుల పై కప్పులతో షాపులు నిర్మించారో.. అలాగే మున్సిపాలిటీ పరిధిలో రేకుల షెడ్లు ఎన్ని ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆస్తి పన్ను చెల్లించాలని బాధ్యులకు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే చర్యలు తీసుకుంటాం.
– బాలకృష్ణ, ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్