సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): మహిళలను వేధిస్తే జైలుకెళ్లడం ఖాయమని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. మహిళలను వేధించిన పలువురికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు. తమకు జరుగుతున్న వేధింపులపై బాధితులు హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా చేస్తున్న ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకుంటూ.. నిందితులను కోర్టులో హాజరుపరచడంతో ఒక్కొక్కరికి 5 నుంచి 8 రోజుల జైలు శిక్షలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించిందని ఆయన వెల్లడించారు.
పెళ్లి విషయాన్ని దాచిపెట్టి స్నాప్‌చాట్ ద్వారా బాధితురాలిని ట్రాప్ చేసి ఆమెతో ఐదేండ్లుగా శారీరక సంబంధం పెట్టుకొని, పెండ్లికి నిరాకరించిన ఎల్బీనగర్, నందనవనంకు చెందిన ఆంజనేయులుపై వాట్సాప్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో షీ టీమ్స్ అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచడంతో ఐదు రోజుల జైలు శిక్ష విధించింది.
బంజారాయిల్స్లో గతంలో తన ఇంట్లో కిరాయికి ఉన్న రాజ్‌కిరణ్ అనే ఒక వ్యక్తి, ఇళ్లు ఖాళీ చేయమన్నందుకు కోపం పెంచుకున్నాడు. దాంతో ఆమెకు గుర్తుతెలియని వ్యక్తిగా ఫోన్ చేసి వేధిస్తున్నాడు, ఇతరులతో అక్రమ సంబంధాలున్నాయని, వ్యక్తిత్వాన్ని కించపరిచి, కుటుంబం పరువు తీస్తానంటూ హెచ్చరించడంతో బాధితురాలు వాట్సాప్ ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేయడంతో న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించింది.
కార్ ర్యాష్‌గా నడుపుతూ ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై మహ్మద్ షాయిబాజుద్దీన్ అసభ్యకర పదజాలంతో దూషించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా మహిళపై కూడా దురుసుగా ప్రవర్తిస్తావా అన్నందుకు మరింత దుసురుగా ప్రవర్తించడంతో బాధితులు షీ టీమ్స్‌కు మెయిల్ చేశారు. దీంతో విచారణ చేసిన షీ టీమ్స్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడంతో 8 రోజుల జైలు శిక్ష పడింది.
తరుచూ బాధితురాలికి ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా నగ్న వీడీయోలు పంపిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న మురళిపై బాధితురాల నేరుగా వెళ్లి షీటీమ్స్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన షీ టీమ్స్ నిందితుడిని కోర్టులో హాజరుపరచడంతో 8 రోజుల జైలు శిక్ష విధించింది.