షాబాద్ : బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ్లలో బీజాపూర్-హైదరాబాద్ రహదారిపై పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అదే విధంగా షాబాద్‌లో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ముంబాయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు.
బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. 14ఏండ్ల సుదీర్ఘపోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ పార్లమెంట్లో తెలంగాణపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
దేశంలో అత్యంత ప్రామణకిమైన పార్లమెంట్‌నే కించపరిచే విధంగా నరేంద్రమోదీ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పార్లమెంట్లో మాట్లాడటం దారుణమన్నారు. అభివృద్ధిని చూసి కడుపుమంటతో ఓర్వలేక తెలంగాణపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మర్పల్లి మాలతీ, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గోవర్దన్‌రెడ్డి, నక్షత్రం, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, ప్రభాకర్, రత్నం తదితరులు ఉన్నారు.