షాబాద్, జనవరి 13: పరిశ్రమల ఏర్పాటుతో రానున్న రోజుల్లో షాబాద్ మండలం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలోని సర్వేనెంబర్ 311లో గల ప్రభుత్వ భూమిలో హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల రైతుల నుంచి భూ సేకరణ చేపట్టింది. భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 750 గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారు. శుక్రవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మొదటగా 15 మంది రైతులకు పట్టా సర్థిఫికేట్లను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ రకాల పరిశ్రమలతో చేవెళ్ల నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే చందనవెళ్లిలో ఏర్పాటు చేసిన వెల్స్పన్ కంపెనీ, ఆమోజాన్, సీతారాంపూర్‌లో ఏర్పాటవుతున్న ఎలక్ట్రికల్ కార్ల తయారీ కంపెనీతో పాటు షాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హెచ్ఎండీఏ వెంచర్‌తో ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు.
భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా తమవంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్‌రావు, తహసీల్దార్ సైదులుగౌడ్, ఆర్ఐ నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, పోనమోని కేతన, కుమ్మరి దర్శన్, నాయకులు రమేశ్‌యాదవ్, రవీందర్, నర్సింహులు, అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.