వికారాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమాగయ్యింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకు కష్టాలు మొదలయ్యాయి. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలను అమలు చేసి ఆపద్బాంధవుడిలా కేసీఆర్ పేరొందితే.. అధికారం చేపట్టిన ఏడాదికే అన్ని వర్గాల ప్రజలను కష్టాలపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మొదట రైతులను నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కారు తర్వాత ఒక్కో వర్గానికి తమ అసలు నైజాన్ని తెలిసేలా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో రాజులా బతికిన అన్నదాతలు నేడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. పంట సాగు మొదలు పెట్టినప్పటి నుంచి పండించిన పంటను కొనేదాకా రైతులకు ఏ కష్టమూ రాకుండా కంటికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే.. రేవంత్‌రెడ్డి అన్నదాతలను అప్పులపాలు చేసి నట్టేట ముంచిండని జిల్లా రైతాంగం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, భూ దందా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ సర్కారు తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌పై లేనిపోని ఆరోపణలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకువచ్చిన అనంతరం రెవెన్యూ సమస్యల పరిష్కారం దేవుడెరుగు.. భూ దందా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెవెన్యూతోపాటు వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ పలు శాఖల్లో కాసులు ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
జిల్లాలోని కొడంగల్, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, గెలిచినవారు కాకుండా ఆయా నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలే పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వ్యవహరాలన్నీ షాడో ఎమ్మెల్యేలకే అప్పగించడంతో అధికారులు మొదలుకొని ఆయా నియోజకవర్గాల జనం షాడో ఎమ్మెల్యేల ఇంటి వద్ద క్యూ కడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మిగతా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోనూ తిరుపతిరెడ్డి చెప్పిందే నడుస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆయనకు సలాం కొడుతూ, రాచమర్యాదలు చేస్తుండటంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై.. ఇటు అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం సోదరుడు వికారాబాద్ జిల్లాకు సీఎంగా మారిపోయారనే జిల్లా ప్రజల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
తాండూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారు. తాండూరులోనే ఉంటూ షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయస్తూ అధికారుల పోస్టింగ్‌లతోపాటు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలను చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా, భూ సెటిల్మెంట్ల విషయంలో వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రసాద్‌కుమార్ గెలిచిన అనంతరం స్పీకర్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఏమైనా కార్యక్రమాలుంటే నియోజకవర్గానికి రావడం.. లేదంటే హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తూ భూముల పైరవీలు, ఇతర దందాల్లో ప్రసాద్‌కుమార్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లోనూ హల్చల్ చేస్తుండడంతో నియోజకవర్గ ప్రజలు విసుగుకుంటున్నారు. ఆయన తీరుతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కూడా బాహాటంగానే వ్యతిరేకిస్తుండడంతోపాటు స్పీకర్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినట్లు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి భూ దందాకు కేరాఫ్‌గా మారిందనే ప్రచారం జరుగుతున్నది. భూ భారతిని అడ్డుపెట్టుకొని లంచమిస్తేనే పని జరుగుతుందనే విధంగా తయారయ్యారు కొందరు ప్రభుత్వ అధికారులు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి అధికారుల వరకు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. భూ సమస్యల పరిష్కారంలో ఆర్ఐ రిపోర్ట్, తహసీల్దార్ అప్రూవల్ తప్పనిసరి కావడంతో చాలా మండలాల్లో డబ్బులిస్తేనే పనులు చేస్తున్నారు. డబ్బులివ్వకపోతే ఆయా మండలాల తహసీల్దార్లు అన్ని సరిగ్గా ఉన్నా ఏదో ఒక కొర్రీ పెడుతూ రిజెక్టు చేసేలా రిపోర్టులు పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చేవారిని కూడా తహసీల్దార్లు వదలడంలేదు, ఉదయం స్లాట్ ఉన్నా సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతూ మండలాన్ని బట్టి రెవెన్యూ అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు.
ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. వారి అండతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. పేదలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్ భూములను అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పదేళ్లపాటు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడుకుంటూ వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కబ్జాకు గురవుతుండడం గమనార్హం. రెవెన్యూ అధికారులతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై భూదందాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జిల్లా కలెక్టర్ చెబితే పనులు చేస్తారో లేదో కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తే మాత్రం ఇట్టే పనులు పూర్తి చేస్తూ.. మీకింత, మాకింత అనే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వైద్యారోగ్య శాఖలో కూడా అవినీతి పెరిగిపోయిందనే ప్రచారం జోరందుకున్నది. వైద్యారోగ్య శాఖ కార్యాలయంతోపాటు క్లినిక్‌ల తనిఖీల పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో సైతం అవినీతి పెరిగిపోయింది. సంబంధిత ఉద్యోగులు ప్రతి రిజిస్ట్రేషన్‌కు డబ్బులిస్తేనే సంతకాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సదరు అధికారులు నేరుగా కాకుండా ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సబ్ రిజిస్ట్రార్లతోపాటు తహసీల్దార్లు ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.5-10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు వినిపిస్తున్నది.
పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖలో అయితే ప్రతీ పనికి కమీషన్ ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొన్నది. సంబంధిత శాఖల అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఆయా శాఖలను బట్టి 5 శాతం, 3, 2 శాతం మేర కమీషన్ ముట్టజెప్పాల్సిందే. డబ్బులివ్వకపోతే నెలల తరబడి సదరు అధికారి లేదా ఉద్యోగి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొన్నది. మున్సిపల్ శాఖలో చివరకు చెక్కుపై సంతకం చేసేందుకు కూడా రూ.2 వేలు లంచమిస్తేనే సంబంధిత ఉద్యోగులు సంతకం పెడుతున్నట్లు కాంట్రాక్టర్లు చెప్పుకొంటున్నారు. అదేవిధంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖలో పై అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది ముందే చెబుతారట.