జిల్లాలో రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం ప్రహసనంగా మారింది. అడుగడుగునా అవంతరాలు ఏర్పడుతుండడంతో దరఖాస్తుదారులు పనుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించగా.. 11 నెలలు గడిచినా ఆ పథకం అందుబాటులోకి రాకపోవడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉన్నా భూ మాత స్కీం వస్తుందని.. ఆ పథకం వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో 16,499 పైగా రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ లాగిన్లలో 7,655 దరఖాస్తులు, ఆర్డీవోలు, తహసీల్దార్ల లాగిన్లలో 8,844 పెండింగ్లో ఉన్నాయి. 7,655 దరఖాస్తుల పరిష్కా రానికి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కానీ అవి పరిష్కారం అవుతాయా..? లేదా ..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు చిన్న, చిన్న సమస్యలున్నా పరిష్కరించడం లేదని అర్జీదారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టీఎం-33 కింద దరఖాస్తు చేసుకున్న వాటికి గత మూడేండ్లుగా మోక్షం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ కలెక్టర్లు మారడమే కారణమా..?
రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడానికి తరచూ కలెక్టర్ల బదిలీలే కారణమనే ఆరోపణలున్నాయి. గత పది నెలల్లో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన వారు ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే లోపే మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. కలెక్టర్లు మారినప్పుడల్లా రెవెన్యూ సమస్యలు పెరిగి పోవడం సర్వసాధారణమైంది. అలాగే, అదనపు కలెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కిన నేపథ్యంలో ఆ సమస్యలు మళ్లీ మూలనపడ్డాయి. దీంతో కొత్తగా వచ్చిన కలెక్టర్ నారాయణరెడ్డిపైనే బాధితులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
11 నెలలు దాటినా అందుబాటులోకి రాని పథకం..
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తాము అధికారంలోకి రాగానే భూమాతను తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన నాయకులు.. 11 నెలలు దాటినా ఇప్పటి వరకూ భూమాతను తీసుకురాలేదు. అసలు భూమాత వస్తుందా.. లేదా.. అనేది రైతుల్లో అయోమయం నెలకొన్నది. భూమాత వస్తుందని అధికారులు రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలున్నాయి. భూమాత పథకం వచ్చిన తర్వాతే ఆ సమస్యలను పరిష్కరిస్తామని కార్యాలయాలకు వచ్చిన అర్జీదారులను అధికారులు వెనక్కి పంపిస్తున్నట్లు సమాచారం.
భూమాత ఊసే లేదు..
నేను టీఎం-33 కింద దరఖాస్తు చేశా. మూడేండ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇటీవల తన దరఖాస్తు తహసీల్దార్ నుంచి ఆర్డీవోకు.. ఆర్డీవో నుంచి కలెక్టర్కు వెళ్లింది. కలెక్టర్ అప్రూవల్ చేయగా ప్రస్తుతం సీసీఎల్ఏలో నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పథకాన్ని తీసుకొస్తామని చెప్పి .. దాని ఊసే ఎత్తడం లేదు. రెవెన్యూ సమస్యలపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
– ఇందిరాల రమేశ్, కౌన్సిలర్, ఇబ్రహీంపట్నం