రంగారెడ్డి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి రంగారెడ్డిజిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఒక పక్క పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరో పక్క కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాగులకు స్కూటీలు, మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలతోపాటు ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ ప్రాంతాల్లో పెద్దఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ తదితరులు తెలంగాణ భవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
పండుగలా పుట్టినరోజు
వికారాబాద్ : వికారాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ధన్నారంలోని యజ్ఞ ఫౌండేషన్‌లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించారు. కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కేక్ కట్ చేసుకొని ఒకరినొకరు తినిపించుకున్నారు. తాండూరులోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయా మండలాల్లో పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకోవడంతో పాటు పలుసేవా కార్యక్రమాలు నిర్వహించారు.