పహాడీషరీఫ్, జూన్ 21: నిరుపేదలు కష్టపడి కట్టుకున్న ఇండ్లలో ఒక్క గజం కూడా వదులుకునేది లేదని, వ్యవస్థల పేరుతో ఇష్టారాజ్యంగా ఇండ్లను కూలుస్తామంటే ప్రభుత్వంపై న్యాయం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆమె నియోజకవర్గంలోని షాహిన్నగర్లో హైడ్రా బాధితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై బాధితులకు భరోసా కల్పించారు.
ప్రభుత్వం అనుమతులు మం జూరు చేసిన తర్వాతే కొనుగోళ్లు జరిపి ఇంటి నిర్మాణాలు చేపట్టామని, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నామని.. అయితే ఇప్పుడు హైడ్రా, ఇరిగేషన్ శాఖల పేరుతో ఆయా నిర్మాణాలు అక్రమంటూ కూల్చివేసేందుకు చూస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశా రు. క్యూబా కాలనీలో నివసిస్తున్న వారిని ఎర్రకుంట ప్రాంతవాసులుగా గుర్తిస్తూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్ పేరుతో తమ నిర్మాణాలను అక్రమమని చెప్పి కూల్చివేసేందుకు చూస్తున్నారని.. ఈ క్రమంలోనే దాదాపు 200 ఇండ్లకు పైగా హైడ్రా అధికారులు మార్కింగ్ చేశారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..నిరుపేదల స్థలాలు, ఇండ్ల విషయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. మార్కింగ్ వేసినంత మాత్రా న ప్రజలు భయపడవద్దని, అవసరమైతే శాసనసభలో ఈ విషయాన్ని చర్చిస్తామని తెలిపారు. స్థానికుల్లో చాలా మంది ప్రభుత్వం నుంచి ఎన్వోసీ, ఎల్ఆర్ఎస్ అనుమతులు పొంది ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. నిర్భంద నోటీసులు జారీ చేయాలని చూస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నగరం చుట్టూ ఉన్న చెరువుల్లోని ఎఫ్టీఎల్ పరిధిల్లో అనేక వెంచర్లు కొనసాగుతున్నా పట్టించుకోని అధికారులు.. దాదాపు 25 ఏండ్ల కిందట ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న వారికి నోటీసులు జారీ చేయడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు.
రెవెన్యూ, మున్సిపల్ శాఖల అనుమతులతోనే పదేండ్ల కిం దట స్థలం కొని ఇంటిని నిర్మించా. ప్రభుత్వానికి మున్సిపల్ ట్యాక్స్, విద్యుత్తు, వాటర్ బిల్లులను చెల్లిస్తున్నా. అయినా ఇప్పుడు వచ్చి చెరువు శిఖం భూమి అంటూ నోటీసులు జారీ చేశారు. పేదలను కావాలనే అధికారులు వేధిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.
– సఫియా ఫాతిమా, క్యూబాకాలనీ
కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇండ్లను కూలుస్తామంటే ఎక్కడికి వెళ్లాలి. 25 ఏండ్ల తర్వాత అధికారులు వచ్చి నోటీసులు ఇవ్వడం ఏమిటీ..? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు వెంచర్లు, స్థలాలకు అనుమతులు ఇవ్వడం అధికారుల తప్పిదమే. నిర్మాణాలకు అనుమతులు జారీచేసిన అధికారులపైనే చర్యలు తీసుకోవాలి.
– బదర్భాయ్, క్యూబాకాలనీ