నందనవనాలను తలపిస్తున్న పల్లె ప్రకృతి వనాలు
గ్రామాలకు సరికొత్త కళ తెచ్చిన పల్లెప్రకృతి వనాలు
ప్రకృతి వనాల్లో పూలు, పండ్లు, నీడ నిచ్చే మొక్కలు
స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకర వాతావరణం
ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
మంచాల మార్చి 14 : మండలంలోని వివిధ గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు నందనవనాలను తలపిస్తున్నాయి. ప్రతి పల్లెకు పల్లె ప్రకృతి వనాలతో సరికొత్త కళ వచ్చింది. తీరొక్క మొక్కలు కనువిందు చేస్తుండగా, గ్రామస్తులు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. మంచాల మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. రెండు ఎకరాల్లో రకరకాల పూలు, పండ్ల మొక్కలతో పాటు సుమారు 5వేల మొక్కలను నాటారు. అవి ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. ప్రకృతి వనంలోకి పశువులు, ఇతర వ్యక్తులు లోనికి వెళ్లకుండా వనం చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. వనం లోపల ఉదయం, సాయంత్రం పెద్దలు, చిన్నారులు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణపై నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పట్టేందుకు వ్యక్తిని నియమించారు. హరితహారంలో భాగంగా మంచాలలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి.
చిట్టడవిలా ప్రకృతి వనం..
పల్లెప్రకృతి వనం చిట్టడవిని తలపిస్తున్నది. 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో ఎటుచూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజు ఇద్దరి సిబ్బంది మొక్కలు, చెట్లకు నీరు పోస్తున్నారు.
కళకళలాడుతున్న మర్పల్లి పల్లె ప్రకృతి వనం
మర్పల్లి, మార్చి 15 : మర్పల్లి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరుగడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. పల్లె ప్రకృతి వనంలో కానుగ, మేత, వేప, గన్నేరు, టేకు, అల్లనేరేడు తదితర మొక్కలను నాటారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సుమారుగా 16 వందలు, మార్కెట్ కార్యాలయ ఆవరణలో 13 వందలు, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 200, ప్రభుత్వ దవాఖాన ఆవరణలో వెయ్యి, పోలీస్ స్టేషన్ ఆవరణలో 500 వరకు మొక్కలను నాటారు. నాటిన మొక్కలకు ఆయా కార్యాలయాల సిబ్బంది సంరక్షిస్తున్నారు. నిత్యం నీళ్లు పట్టడంతో పాటు కలుపుమొక్కలను తొలగించడంతో మొక్కలు ఏపుగా పెరిగి అద్భుతంగా కనిపిస్తున్నాయి.
కార్యాలయాలకు పచ్చందాలు..
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలతో పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. మార్కెట్ కార్యాలయం ఆవరణ నాలుగు ఏండ్ల కింద ఎడారిగా ఉండేది. సుమారు 13 వందల మొక్కలు నాటారు. వాటికి ట్రీ గార్డుల ఏర్పాటుతో సిబ్బంది నిత్యం నీటిని పడుతున్నారు. మార్కెట్కు వచ్చిన రైతులు చెట్ల కింద ప్రశాంతంగా సేదతీరుతున్నారు.
– అంజిరెడ్డి, ఏపీవో మర్పల్లి
ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనం..
తీరొక్క మొక్కలతో మంచాల ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. వనంలో సుమారు 5 వేల మొక్కలను నాటి, సంరక్షించేందుకు వనసేవకుడిని నియమించాం. నిత్యం నీళ్లు పోయడంతో ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. గ్రామస్తులు ఉదయం, సాయంత్రం గ్రామస్తులు వాకింగ్ట్రాక్లో వాకింగ్ చేస్తున్నారు. గ్రామస్తులు, గ్రామ పాలకుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.
– జగన్రెడ్డి, సర్పంచ్