షాద్నగర్, ఆగస్టు1 : గ్రామాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోమాల్పల్లి గ్రామంలో హైదరాబాద్, పోమాల్పల్లి గ్రామాల మధ్య రాకపోకలు సాగించే నూతన ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ సేవలు మరింత విస్తృతం అయ్యాయని వివరించారు. షాద్నగర్ ప్రాంతం రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండంతో గ్రామాలకు సిటీ ఆర్టీసీ సేవలు అందుతున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
సిటీ బస్సులతో పల్లె ప్రజలకు చాల ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్రామం నుంచి నగరాలకు రాకపోకలు సాగించేందుకు మంచి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.