పరిగి, జనవరి 25 : ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక వారం తేడాలోనే క్వింటాలుకు రూ.2 వేలు తక్కువ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరుశనగ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ఆందోళన చేసిన రైతులు మార్కెట్ యార్డులో దుకాణాలను మూసివేయించి మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. పరిగి మార్కెట్ యార్డుకు వేరుశనగ విక్రయించేందుకు పరిగి, బొంరాస్‌పేట మండలాల నుంచి శనివారం అధిక సంఖ్యలో రైతులు వచ్చారు. శుక్రవారం ఆన్లైన్ ఇబ్బందులతో టెండర్లు జరగకపోగా శనివారం ఆన్లైన్ టెండర్లు వేసిన వ్యాపారులు కుమ్మక్కై గత వారంతో పోలిస్తే క్వింటాలుకు రూ.2వేలు తక్కువగా కోట్ చేశారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6783 ప్రకటించగా, గత శుక్రవారం పరిగి మార్కెట్లో రూ.6500 వరకు విక్రయింపబడింది.
ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే సుమారు రూ.300 తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేసినా రైతులు వేరుశనగ విక్రయించారు. కాగా, శనివారం వ్యాపారులు సిండికేట్‌గా మారి వేరుశనగకు తక్కువ కోట్ చేశారు. సుమారు 800 లాట్స్కుగాను ఆన్లైన్లో 50కి పైగా లాట్స్‌కు కనీసం ఒక్క టెండర్ కూడా దాఖలవకపోగా 150 లాట్స్‌కు తక్కువ ధర వేసినట్లు అధికారులే చెబుతున్నారు. సరాసరిన శనివారం అత్యధిక రైతుల వేరుశనగకు రూ.4500 ధర వేశారని పేర్కొంటూ రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు నుంచి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి వరకు ర్యాలీ చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. సుమారు 2 గంటలపాటు రహదారిపై రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పరిగి ఎస్ఐ సంతోష్‌కుమార్, పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.
జాతీయ రహదారిపై ఆందోళన చేస్తే కేసులవుతాయని, మార్కెట్ యార్డుకు వెళ్లాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించారు. అనంతరం మార్కెట్ యార్డుకు వెళ్లి దుకాణాలను మూసి వేయించారు. ఏ ఒక్కరూ వేరుశనగ కొనరాదని, కనీస మద్దతు ధర ఇస్తేనే కొనాలంటూ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోసారి టెండర్ దాఖలుకు అవకాశం ఇచ్చామని మార్కెట్ కార్యదర్శి చెప్పగా ఒక్క వారంలోనే ధరలు ఎందుకు తగ్గాయంటూ రైతులు ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో రైతులు మరోసారి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి మార్కెట్ యార్డుకు తీసుకెళ్లారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధర కోట్ చేస్తున్నారని ఆరోపించారు. తక్‌పట్టీలు ఇవ్వడం లేదని రైతులు తెలిపారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్‌కుమార్ రైతులు, మార్కెట్ కమిటీ కార్యదర్శితో మాట్లాడారు. రీ టెండర్లో అధిక ధర వస్తే రైతులకు ఇష్టం వస్తే విక్రయించాలని, లేదంటే సోమవారం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చూస్తామని ఎస్ఐ, మార్కెట్ కార్యదర్శి హామీ ఇచ్చారు. అనంతరం పరిగి మార్కెట్ కమిటీకి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి రైతులతో మాట్లాడి రైతులు కోరుకున్న ధర రాకుంటే సోమవారం ప్రభుత్వం ద్వారా కొనుగోలు జరిగేలా చూస్తామని చెప్పారు.
గత వారం క్వింటాలుకు రూ.6500లకు వేరుశనగ పరిగి మార్కెట్లో అమ్ముడైతే, ఈ వారం ఒక్కసారిగా రూ.2000 ఎలా తగ్గుతుంది. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వేరుశనగ కొనుగోలు చేయాలి.
– పొడల రాములు, రైతు, వడిచెర్ల