Shankarpally | చేవెళ్ల రూరల్, ఏ్రపిల్ 15 : పేరుకే శంకర్పల్లి మున్సిపాలిటీ. ఇక రోడ్ల పరిస్థితి అంటే అంతే సంగతి. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లికి వెళ్లాలంటే ఫతేఫూర్ రైల్వే వంతెన దాటి వెళ్లాలి. ఫతేఫూర్ బ్రిడ్డి రోడ్డు పూర్తిగా గుంతలమయై దుమ్ము లేస్తోంది. చిన్న పాటి వర్షాలు కురిస్తే అంతే సంగతి చెరువును తలపించేలా ప్రధాన రోడ్డు తయారవుతోంది. సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్య ర్పడినప్పుడు పరిశీలించి వెళ్లుడే తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
నాణ్యత, సరైన ప్రణాళిక లేకనే..
శంకర్పల్లి మున్సిపల్ పరిధి ఫతేపూర్ రైల్వే వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు, సరైన ప్రణాళిక రూపొందించకపోవడంతోనే రోజురోజుకు సమస్య అధికమవుతున్నదని ప్రజలు వాపోతున్నారు. రోడ్డులో మట్టి కిందకు కూరుకుపోవడంతో పాటు, వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. చిన్న పాటి వర్షం పడితే రోడ్డును మూసివేసే పరిస్థితి నెలకొంటున్నది.
ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే చిరాకేస్తోంది..
శంకర్‌పల్లికి రావాలన్నా.. ఈ రోడ్డు గుండా వెళ్లాలన్నా చిరాకేస్తోంది. రోడ్డు నిబంధలనలు పాటించకుండా ఎట్ల పడితే అట్ల వాహనాలు వెళ్తున్నాయి. రాత్రి పూట ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాస్, ప్రయాణికుడు, దేవునిఎర్రవల్లి గ్రామం, చేవెళ్ల మండలం
ఇబ్బందులు పడుతున్నాం..
మా గ్రామం నుంచి రోజుకు మూడు, నాలుగు సార్లు శంకర్‌పల్లికి వస్తుంటాం. ఈ రోడ్డు నుంచి వెళ్లాలంటేనే భయమేస్తుంది. లారీలు, హెవీ వెహికిల్స్ వస్తుంటాయి. రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. రోడ్డు బాగా లేకున్నా స్పీడ్‌గా వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– రమేశ్, ప్రయాణికుడు, చందిప్పగ్రామం, శంకర్పల్లి మండలం
ఏం రోడ్డు ఇది..
శంకర్‌పల్లికి వెళ్లాలంటేనే ఏం రోడ్డురా బాబు అని భయమేస్తున్నది. కొన్ని సార్లు చిన్నపాటి వర్షానికే వంతెన కింద చెరువును తలపించేలా నీరు నిలుస్తుంది. రాకపోకలు నిలిచిపోతున్నాయి. చాలా అసౌకర్యానికి గురవుతన్నాం. అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారింది.
– అంజయ్య, ప్రయాణికుడు, అలంఖాన్‌గూడ, శంకర్పల్లి మండలం
మున్సిపల్ అయినా అన్ని సమస్యలే..
శంకర్పల్లి మున్సిపల్ అయినప్పటికీ అన్ని సమస్యలే. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. ప్రజల ఇబ్బందులు అధికారులు, ప్రభుత్వానికి కనిపించడం లేదా. చూస్తున్నరు.. పోతున్నరు తప్పా.. పరిష్కారం చూపడం లేదు. ప్రభుత్వం వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి.
– రమేశ్, ప్రయాణికుడు, అలంఖాన్‌గూడ, శంకర్పల్లి మండలం
రూ.17 లక్షలు ప్రతిపాదించాం..
మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్, ఫతేపూర్ వార్డుల పరిధిలోని కల్వర్టు ఏరియాలో రోడ్డు మరమ్మతులకు మున్సిపల్ నిధుల నుంచి రూ.17 లక్షలు ప్రతిపాదించాం. అంతలోనే ఆర్అండ్బీ అధికారులు రోడ్డు వేస్తామన్నారు. రైల్వే వంతెన రోడ్డును పరిశీలించాం. ఆర్అండ్బీ అధికారులు త్వరలోనే మరమ్మతులు చేపడుతామన్నారు.
– యోగేశ్, శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్
రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం
గుంతలమయమైన రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాం. ఫతేపూర్ రైల్వే వంతేన రోడ్డుకు రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఏఈ