యాచారం, ఏప్రిల్ 14 : కోర్టు స్టే ఉన్న భూముల్లోకి అక్రమంగా అధికారులు, పోలీసులు వెళ్లొద్ద ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమా ర్ అన్నారు. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఫార్మాసిటీ బాధిత రైతులు, రైతు కూలీలు సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు రాజ్యాంగాన్ని కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
ఫార్మా బాధిత రైతులను ఆదుకోవాలని, జై భీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కంచె ఏర్పా టు చేస్తూ రైతులపట్ల అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును రైతులు హైకోర్టు విశ్రాం త న్యాయమూర్తి చంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన మాట్లాడుతూ.. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న భూముల్లోకి అధికారులు, పోలీసులు అక్రమంగా వెళ్తే చట్టవిరుద్ధమవుతుందన్నారు. ఆ భూముల్లో సర్వే చేసినా, కంచె ఏర్పాటు చేసినా సంబంధిత అధికారులు, పోలీసులపై చట్టపరమై న చర్యలు తీసుకునేలా రైతుల తరఫున పోరాడుతామన్నా రు.
కోర్టు ధిక్కరణకు పాల్పడొద్దని సూచించారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకునే హక్కు పోలీసులకు లేదన్నారు. ఫార్మా కంపెనీలు ఎక్కడ పెట్టినా వినాశనమేనని పేర్కొన్నారు. రెండు పంటలు పండే భూములను బలవంతంగా సేకరించి ఫార్మా కంపెనీలు పెట్టడం సరైంది కాదన్నారు. ప్రజలు, రైతుల అంగీకారం లేనిదే భూములను సేకరించొద్దన్నారు. ఎన్నికల ముందు రైతులకిచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, రైతుల పేర్లు ఆన్లైన్లో ఎక్కించి, వారికి ప్రభు త్వ పథకాలు వర్తించేలా చూడడంతోపాటు.. ఆ భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను రైతులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా బాధిత రైతులు తమ హక్కుల సాధనకు ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాడాలని.. వారికి తన మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బందె రాజశేఖర్‌రెడ్డి, ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకురాలు కవుల సరస్వతి, కుందారపు సత్యనారాయణ, కానమోని గణేశ్, సామ నిరంజన్, మహిపాల్, సందీప్‌రెడ్డి, రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామస్తులు ఉన్నారు.