రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దన్న సదుద్దేశంతో నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు సాగు పనులు మొదలు, పంట చేతికొచ్చేవరకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయ పనిముట్లతో పాటు ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై అందజేస్తూ ఆసరా అవుతున్నారు. పెట్టుబడికి ఇబ్బందులు పడకూడదని రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర సర్కార్ అందజేస్తున్నది. దీంతో బ్యాంకుల్లో పెట్టుబడి కోసం అప్పులు తీసుకోవడం తగ్గింది. ఐదేండ్లుగా వికారాబాద్ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి కేవలం 35 శాతం మాత్రమే బ్యాంకు రుణాలు మంజూరవుతుండడం గమనార్హం. అయితే ఈ ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కింద రూ.2356 కోట్ల పెట్టుబడి సాయాన్ని జిల్లా రైతాంగానికి అందించింది.
– వికారాబాద్, జనవరి 13, (నమస్తే తెలంగాణ)
ఐదేండ్లుగా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపని అన్నదాతలు
వికారాబాద్, జనవరి 12, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న చర్యలతో రైతులకు రుణభారం తప్పింది. గతంలో వానాకాలం, యాసంగి వస్తుందంటే చాలు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. పంట పెట్టుబడి నిమిత్తం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను, వడ్డీని చెల్లించలేక కొందరు రైతుల ఆస్తులను జప్తు చేసిన సంఘటనలు ఉన్నాయి.
పంట సాగుతో వచ్చిన డబ్బులకు మించి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులుండడంతో రైతులు రుణభారంతో అష్టకష్టాలు పడేవారు. అయితే రైతుల పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు పథకంతో బ్యాంకుల నుంచి, వడ్డీ వ్యాపారుల వద్ద చేసే అప్పుల బాధలు తప్పినాయి.

బ్యాంకర్లు ముందుకొస్తున్నా..
రైతుబంధు అమల్లోకి వచ్చిన ఐదేండ్ల నుంచి రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నప్పటికీ తీసుకునేందుకు మాత్రం రైతులు ఆసక్తి చూపడం లేదని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెట్టుబడి సాయం నిమిత్తం ఎకరాకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుండడంతో రైతులు బ్యాంకులవైపే చూడడం లేదని చెబుతున్నారు.
ఐదేండ్లలో జిల్లాలో పంట రుణాలకు సంబంధించి వానాకాలం, యాసంగి సీజన్లకు నిర్దేశించిన లక్ష్యంలో 35 శాతం మాత్రమే రుణాలు మంజూరు అవుతుండడం గమనార్హం. గతంలో ప్రతీ ఏటా నిర్దేశించిన లక్ష్యంలో 75 శాతం మేర రుణాలను మంజూరు చేసినప్పటికీ, అందరికీ రుణాలు అందలేదనే ఫిర్యాదులతో జిల్లా ఉన్నతాధికారులు బ్యాంకర్లపై వంద శాతం రుణాలను మంజూరు చేసేలా ఒత్తిడి తెచ్చిన పరిస్థితులుండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసింది. రెండేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలైందనే విధంగా వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది.

రైతు కుటుంబానికి అండగా..
అలాగే రైతు మృతి చెందితే బాధిత కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా మారి.. వారికి అండగా నిలుస్తూ.. రైతుబీమా పథకంలో భాగంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయాన్ని అందించడంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పినాయి. ఏటా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసే రోజులకు ప్రభుత్వం చెక్ పెట్టింది.
గత ఐదేండ్లలో..
అయితే రైతుబంధు పథకం కింద గత ఐదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2356 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేశారు. అయితే 2018 వానాకాలం సీజన్లో 1,94,123 మంది రైతులకు రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,854 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానాకాలం సీజన్లో 1,87,377 మందికి రూ.240 కోట్లు, యాసంగి సీజన్లో 1,51,647 మందికి రూ.169 కోట్ల పెట్టుబడి సహాయాన్ని, 2020 వానాకాలం సీజన్లో 2,13,341 మంది రైతులకు రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మందికి రూ.301 కోట్ల పెట్టుబడిని, 2021 వానాకాలం సీజన్లో 2,25,438 మందికి రూ.300 కోట్ల ఆర్థిక సహాయాన్ని, యాసంగి సీజన్లో 1,94,072 మందికి రూ.169 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందజేశారు.
అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం సీజన్లో 2,47,232 మంది రైతులకు రూ.304 కోట్ల రైతుబంధు సహాయాన్ని, యాసంగిలో ఇప్పటివరకు 1,88,656 మంది రైతులకు రూ.146 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
రైతు బంధుతో ఎరువుల కొనుగోలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం డబ్బులతో వ్యవసాయానికి అవసరమయ్యే ఎరువులను కొనుగోలు చేస్తున్నాను. గతంలో రెండు సీజన్లల్లో ఎరువుల కోసం ఇతరుల వద్ద డబ్బులు అప్పుగా తీసుకు రావాల్సి వచ్చేది. ప్రతి ఏటా నాకున్న నాలుగెకరాల పొలానికి రూ.40వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయానికి ఇతరుల నుంచి అప్పు తీసుకొకుండా పురుగుల మందులు, ఎరువులు కొనుగోలు చేస్తున్నాను. ఈ పథకం ప్రవేశపెట్టడంతో రైతుల్లో వ్యవసాయం చేసేలా ఆత్మవిశ్వాసం పెరిగింది.
– రాములు, రైతు, కొత్తపల్లి, పూడూరు
అప్పట్లో 3 ఎకరాలు.. ప్రస్తుతం 5 ఎకరాల సాగు..
రైతుబంధు రాకముందు మూడెకరాల్లోనే పంట సాగు చేసుకునే వాళ్లం. రైతుబంధు అందుకున్న తర్వాత ఉన్న మొత్తం ఐదెకరాల్లో పంట సాగు చేసుకొంటున్నాం. ఆర్థిక ఇబ్బంది కారణంగా పూర్తి స్థాయిలో పంట సాగు చేసుకునే అవకాశం ఉండేది కాదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మూడెకరాల్లో పంట సాగు చేసుకొనే వాళ్లం. పంట చేతికొచ్చాక వడ్డీల భయానికి ఉన్నంతలోని ధరలో పంటలను అమ్ముకొని సావుకారికి అప్పు చెల్లించి మిగిలిన మొత్తంతో కాలం గడిపే వాళ్లం. ప్రస్తుతం రైతుబంధు పథకం అందుకొని ఆత్మాభిమానంతో వ్యవసాయం చేస్తున్నాం. పంట చేతికొచ్చిన తర్వాత ఆతృత పడకుండా ధర ఉన్నప్పుడే పంటలను అమ్ముకొని ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నాం. దండుగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేశారు. సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– బాల్‌రాజ్‌గౌడ్. రైతు, హస్నాబాద్, కొడంగల్
అప్పుల బాధలు తప్పినాయి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం మాలాంటి రైతులకు చాలా ఉపయోగపడుతున్నది. రైతుల బాధలు తెలిసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ మా కోసం కృషి చేస్తున్నారు. గతంలో సీజన్ వారీగా పంటలు సాగు చేస్తే లాగోడికి సావుకారి దగ్గర అప్పులు తెచ్చి మరీ లాగోడికి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్లం. దీనికి గాను తాము సావుకారికి పంట వేసిన ధాన్యాన్ని వారికి ఇచ్చేవాళ్లం. లాగోడి పోను మిగిలేది కొద్దిగా మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు రూ.5వేల చొప్పుల పెట్టుబడికి సహాయం అందిస్తుండడంతో లాగోడికి ఇబ్బంది లేకుండా పంటలు సాగుచేస్తున్నాం. అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఉంది. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రెండు ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నాను.
– గుండుమల్ల నర్సింహులు, రైతు, తిర్మలాపూర్, కులకచర్ల
ధీమాగా వ్యవసాయం చేసుకొంటున్నాం
రైతు బంధుతో ధీమాగా వ్యవసాయం చేసుకొంటున్నాం. గతంలో వ్యవసాయం చేయాలంటే ఆర్థిక ఇబ్బందితో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాళ్లం. అర్థిలో వ్యాపారుల వద్ద అప్పు తీసుకొచ్చి పంట సాగు చేసుకునే వాళ్లం. నాకున్న 16 ఎకరాల్లో పెట్టుబడికి భయపడి సగం వరకు మాత్రమే సాగు చేసుకునే వాళ్లం. రైతు బంధు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పంట సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ప్రస్తుతం వరి, కంది, పత్తి పంటలను సాగు చేస్తున్నాం. కుటుంబంలో మొత్తం 8మంది కుటుంబ సభ్యులం సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నాం. రైతుబంధు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతి రైతు రుణపడి ఉంటారు. రైతుబంధు ఆత్మాభిమానాన్ని పెంచింది.
– గొర్లకాడి మోహన్, రైతు, పర్సాపూర్, కొడంగల్