జవహర్‌నగర్, మే 10: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండటమే ముఖ్యమని కమాండర్ విజయ్‌కుమార్ వర్మ ప్రజలకు సూచించారు. సంక్షోభ సమయాల్లో పౌరులు ఎలా స్పందిస్తే ప్రమాదాలను నివారించవచ్చో ఆయన వివరించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ చేపట్టింది.
శనివారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అరుంధతినగర్ ప్రభుత్వ పాఠశాల మరియు కాలనీ ప్రజల కోసం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండర్ విజయ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ, శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దాడికి వస్తే ప్రజలు ఎలా సిద్ధంగా ఉండాలో మరియు వాటి నుండి ఎలా తప్పించుకోవాలో యుద్ధ విన్యాసాల ద్వారా వివరించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికల పనితీరును, సైరన్ మోగిన వెంటనే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పివేసి, ఇంట్లో సురక్షితమైన స్థలాల్లో దాక్కోవాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎదురైతే, వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలనే విషయాలను కమాండోలు కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. ఈ విన్యాసాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అరుంధతినగర్‌కు చెందిన యువకులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mockdrill