ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ పార్లమెంట్ ఉమ్మడి సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు డిమాండ్ చేశారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లో ప్రధాన రహదారులల్లో దిష్టిబొమ్మలతో ఊరేగింపు చేపట్టి దహనం చేసి నిరసనకు దిగారు.
కడ్తాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, ఆమనగల్లు మండలంలో మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, తలకొండపల్లి మండలంలో శంకర్, మాడ్గుల మండలంలో జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు, నాగర్‌కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధినాయకత్వం ప్రధాని మోదీ విషం చిమ్ముతునే ఉన్నాడన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా దేశ ప్రధాని వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో తాము మద్దతూ ఇచ్చామని ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల ఓట్ల కోసమే బీజేపీ నాయకులు అడుతున్నా డ్రామాలకు నేటితో తెరపడిందన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణకు మెండి చేయ్యి చూపడంతో పాటు రాష్ట్ర ప్రజలను అవమాన పరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేష్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, డైరెక్టర్ సుభాష్, నాయకులు ఎంగలి రఘు, అప్పం శ్రీను, సుక్క నిరంజన్, బాలస్వామి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.