తుర్కయాంజాల్ : అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం తొరూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383/1లోని ప్రభుత్వ భూమిలో అధికారులు చేపట్టిన సర్వేను స్థానిక రైతులు అడ్డుకోగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ శుక్రవారం భూ నిర్వాసితులతో చర్చించారు. సర్వే నంబర్ 383/1లోని సుమారు 115 ఎకరాలను 2008లో రాజీవ్ స్వగృహకు కేటాయించారు. అప్పట్లో బాధిత రైతులకు నష్టపరిహారంతో పాటు 500గజాల ఇంటి స్థలం, ఒక గేదెను అందజేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు కొంత మొత్తం నష్టపరిహారం మాత్రమే రైతులకు అందజేశారు. అప్పట్లో ఈ భూములను రాజీవ్ స్వగృహ స్వాధీనం చేసుకోకపోవటంతో తమ భూములను తిరిగి తమకే అప్పగించాలని సుమారు 100 మంది రైతులు అప్పటి నుంచి పోరాడుతున్నారు. ఈ విషయంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో సదరు భూమిని ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకున్నందున రైతుల దావాను కోర్టు తిరస్కరించింది. అయిన రైతులు పట్టు వదలకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వచ్చి మళ్లీ సర్వే చేపట్టడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు అధికారులు ఈ భూముల్లో సర్వే చేయరాదంటు రైతులు పెద్ద ఎత్తున్న ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్ స్వయంగా రైతులతో చర్చించేందుకు ఆర్డీఓ వెంకటాచారి, తాసిల్ధార్ వెంకటేశ్వర్లుతో కలిసి నేరుగా రైతులతో మాట్లాడేందుకు వచ్చారు. 1950 ఏకసాల్ పట్టా పొందిన తాము అప్పటి నుంచి కబ్జాలో ఉంటూ సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని రైతులు కలెక్టర్‌కు వివరించారు. రాజీవ్ స్వగృహా పేరుతో తమ భూములను స్వాధీన పరుచుకొని సరైన నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారని రైతులు కలెక్టర్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే సర్వే చేస్తున్నామని సర్వేను అడ్డుకోవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు. కాగా భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు నష్టపరిహారంతో పాటు, 500గజాల ఇంటి స్థలం, ఒక గేదెను ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని రైతులు కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరిగేంత వరకు ఈ భూముల జోలికి రావద్దని రైతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఒప్పందం ప్రకారం బాధిత రైతులకు 500గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు అంగీకరిస్తేనే సర్వే చేయనిస్తామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో కలెక్టర్ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం నుంచి తిరిగి సర్వేను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.