షాబాద్, జూన్ 15: గ్రామాల్లో పల్లె పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల్లో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుంది. గతేడాది జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుండి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. పల్లెల్లో పారిశుధ్యం పడకేయడంతో పాటు సరైన నిర్వహణ లేక పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా మారింది.
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత 16 నెలల క్రితం గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తుంది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. హరితహారం, ఉపాధిహామీ, పల్లెప్రగతి, ఇంటి పన్నుల వసూలు, పారిశుధ్యం తదితర పనులతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్లలో డీజిల్ పోయడం, అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఒక్కో గ్రామ పంచాయతీల్లో వివిధ పనులు చేపట్టడానికి కార్యదర్శులు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
కనిపించని శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం ప్రారంభంలోనే గ్రామాల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పారిశుధ్య పనులు చేపట్టేవారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేవారు. దీంతో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో వ్యాధుల జాడ కనిపించలేదు. పల్లె ప్రకతి వనాలు, వైకుంఠధామాలతో గ్రామాలకు కొత్త శోభ సంతరించుకుంది, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పల్లెల్లో పడకేసిన పారిశుధ్యంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు.