జీడీడీపీ, తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్
పెట్టుబడుల్లో రెండవ.. ఉపాధి కల్పనలో మూడో స్థానం
ఇండస్ట్రియల్, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మరెన్నో మెగా ఉత్పత్తి పరిశ్రమలకు నెలవు జిల్లా
గత ఏడేండ్లలో జిల్లాకు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు
సుమారు 3.50 లక్షల మందికి ఉపాధి
రంగారెడ్డి, మార్చి 16, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఐటీ, ఫార్మా, హార్డ్‌వేర్ వంటి ప్రముఖ పరిశ్రమలతో జిల్లా పారిశ్రామికహబ్‌గా అవతరించింది. దీంతో భారీ పెట్టుబడులు, అత్యధిక ఎగుమతులతో మన జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా ఉన్నది. ఇటీవల వెల్లడైన సామాజిక, ఆర్థిక సర్వేలో జిల్లా అన్ని రంగాల్లోనూ ముందువరుసలో నిలిచింది. తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. జాతీయ స్థాయిని మించి జిల్లా తలసరి ఆదాయం ఉందంటే అతిశయోక్తికాదు. జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,757 ఉండగా, జిల్లా తలసరి ఆదాయం రూ.6,58,757 ఉండడం విశేషం. పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రెండోస్థానం, ఉపాధి కల్పనలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడేండ్లలో జిల్లాకు రూ.22వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతేకాకుండా సుమారుగా 3.50లక్షల మందికి ఉపాధి లభించింది.
రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా నుంచే అత్యధిక రెవెన్యూ సమకూరుతున్నది. ఐటీ, ఫార్మా, హార్డ్‌వేర్ తదితర పరిశ్రమలు, భారీ పెట్టుబడులు, అత్యధిక ఎగుమతులతో అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా నంబర్ వన్‌గా నిలిచింది. ఇటీవల వెల్లడైన సామాజిక, ఆర్థిక సర్వేలో జిల్లా అన్ని రంగాల్లోనూ టాప్‌లో నిలిచింది. తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. ఐటీ, ఫార్మా తదితర పరిశ్రమలతోపాటు ఉపాధి వనరులు అధికంగా ఉండడంతో తలసరి ఆదాయంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. జాతీయ తలసరి ఆదాయాన్ని మించి జిల్లా తలసరి ఆదాయం ఉండడం గమనార్హం.
జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,757 ఉండగా, జిల్లా తలసరి ఆదాయం రూ.6,58,757 ఉండడం విశేషం. మరోవైపు జీడీడీపీలోనూ జిల్లా ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి, సేవలు, ఫార్మా, వ్యవసాయ తదితర రంగాల్లో ముందుండడంతో రూ.1,93,507 కోట్ల జీడీడీపీని నమోదు చేసింది. అదేవిధంగా పెట్టుబడుల్లో జిల్లాకు రెండో స్థానం దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడేండ్లలో జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో పారిశ్రామికాభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితరాలతో పారిశ్రామిక రంగానికి నవశకం మొదలైంది.
జిల్లాకు భారీగా పెట్టుబడులు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భారీ మార్పులతో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉండడంతో ఎన్నో ఇండస్ట్రియల్, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలు వచ్చాయి. వెల్స్పన్, క్రొనస్, టాటా, విజయ్‌నేహా, పోకర్ణ ఇంజనీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లను జిల్లాలో నెలకొల్పారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామికరంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది. టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండడంతో అధిక మొత్తంలో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో సుమారు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో రూ.19,028 కోట్ల పెట్టుబడులు టీఎస్-ఐపాస్ విధానం అమల్లోకి వచ్చిన తరువాతే వచ్చాయి. ఏడేండ్లలో 2,277 సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటుకాగా రూ.670 కోట్ల పెట్టుబడులు, 1168 చిన్నతరహా పరిశ్రమలకు రూ.2,689 కోట్లు, 105 పెద్ద తరహా పరిశ్రమలకుగాను రూ.3,566 కోట్లు, 63 మధ్యతరహా పరిశ్రమలతో రూ.1,112 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా 11 మెగా ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటుకాగా రూ.3971 కోట్ల పెట్టుబడులు, 33 మెగా ఇన్ఫ్రా(ఐటీ టవర్స్) ప్రాజెక్టులు ఏర్పాటుకాగా రూ.9765 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పేందుకుగాను సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. షాబాద్ మండలంలోని చందన్‌వెళ్లి, సీతారాంపూర్లలో రూ.1200 కోట్లతో కిటెక్స్, రూ.750 కోట్లతో మలబార్, రూ.800 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది.
3.50 లక్షల మందికి ఉపాధి…
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో ఇటు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. జిల్లాలో అన్ని తరహా పరిశ్రమలు ఉండడంతో ఉపాధి కల్పనలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో సుమారు 3.50 లక్షల మంది ఉపాధి పొందారు. అయితే సూక్ష్మ తరహా పరిశ్రమలతో 26,492 మంది, చిన్న తరహా పరిశ్రమలతో 33,456 మంది, మధ్యతరహా పరిశ్రమలతో 5361 మంది, పెద్ద తరహా పరిశ్రమలతో 19,395 మంది, మెగా ఉత్పత్తి పరిశ్రమలతో 7410 మంది ఉపాధి పొందుతున్నారు. అత్యధికంగా మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతోనే జిల్లాలో రికార్డు స్థాయిలో ఉపాధి లభించింది. జిల్లాలో 33 మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో 2.50 లక్షల మందికి ఉపాధి దొరికింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తుండడంతో రాష్ర్టానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన యువతీ,యువకులు ఉపాధి కోసం ఇక్కడకు తరలివచ్చారు. ప్రైవేట్ పరిశ్రమల్లోనూ పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తుండడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసిన వారు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.