రంగారెడ్డి, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌కు మద్దతుగా జిల్లాలోని ఊరూరు కదిలివచ్చింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపట్టి తెలంగాణ వాదాన్ని చాటారు. మలిదశ ఉద్యమంలో ప్రధానమైన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలకు జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివెళ్లి కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. మలిదశ ఉద్యమంలో భాగంగా వికారాబాద్ వెళ్తూ చేవెళ్ల చౌరస్తాలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నియామకాలు తదితరాల్లో జరుగుతున్న అన్యాయం, స్వపరిపాలనపై ఉద్యమ నేత కేసీఆర్ ప్రసంగంతో జిల్లా ప్రజల్లో ఆలోచన మరింత రేకెత్తించేలా చేసింది.
2001 నుంచే జిల్లాలో ప్రభావం..
జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం తొలినాళ్ల నుంచే ఉన్నది. ఉద్యమ పార్టీగా ఆవిర్భావమై ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగిన టీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఇతర పార్టీల్లో బలమైన నాయకులు కూడా కేసీఆర్ వెంట నడిచేందుకు ముందుకొచ్చారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కాగా మొదటి బహిరంగ సభ జిల్లాలోని షాద్‌నగర్‌లోనే నిర్వహించారు. ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై నాయకుడికి జైకొట్టారు. అదే సమయంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రస్తుత షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేశంపేట మండల జడ్పీటీసీగా పోటీ చేసి మంచి మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయంగా మలుపుతిప్పిందని చెప్పవచ్చు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచిన కేఎస్ రత్నం సైతం గులాబీ కండువా కప్పుకోవడంతో జిల్లా అంతటా టీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ మొట్టమొదటి బతుకమ్మ కార్యక్రమం కూడా 2007లో జిల్లాలోని షాద్‌నగర్‌లోనే నిర్వహించడం గమనార్హం. దీంతో జిల్లాలో తెలంగాణవాదం మరింత పెరగడానికి దోహదపడింది. మలిదశ ఉద్యమంలో భాగంగా ఊరూరా ఉద్యమాన్ని విస్తృతం చేయాలన్న సంకల్పంతో పల్లెనిద్ర శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ 2009లో కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేటలో పాల్గొనగా, షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలంతా కదిలివచ్చి మద్దతు తెలిపారు. అదేవిధంగా 2008లో షాద్‌నగర్‌లో తెలుగుతల్లి విగ్రహం ధ్వంసంతో జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలుగుతల్లి విగ్రహం ధ్వంసం ఘటనలో టీఆర్ఎస్ నేతలుకార్యక్రమానికి రాజవరప్రసాద్, మన్నె నారాయణ జైలుకు కూడావెళ్లారు. టీఆర్ఎస్ పార్టీకి అస్సలు క్యాడరేలేని జిల్లాలో ఏ పార్టీకి లేనంత క్యాడర్‌ను ఏర్పర్చుకున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టిన జిల్లా ప్రజలు ఆ తర్వాత ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్‌కే జైకొడుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతోపాటు పార్లమెంట్, అసెంబ్లీ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు గులాబీ జెండాకే మద్దతు పలుకుతున్నారు. అస్సలు క్యాడర్‌లేని స్థాయి నుంచి కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు ప్రచారం చేయకపోయినా.. గెలువచ్చనే దృఢ నమ్మకం వరకు టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది.
జిల్లా ప్రజలు మొదటి నుంచీ టీఆర్ఎస్ వైపే..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉన్నారు. సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా… గెలుపు టీఆర్ఎస్దే అన్న స్థాయికి అధికార పార్టీ టీఆర్ఎస్ చేరింది. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్, ప్రజల మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసేందుకు కూడా వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో కనీవినీ ఎరుగని విధంగా అధిక అభివృద్ధి జరిగింది. ప్రధానంగా పారిశ్రామిక రంగంతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది.
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు