నమస్తే తెలంగాణ,నెట్వర్క్: భారతదేశానికి సీఎం కేసీఆర్ ఆశాకిరణమని, దేశ ప్రగతి ఆయన తోనే సాధ్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంపీటీసీలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది..? అని అడిగిన వారికి ఆయన 24 గంటలపాటు పంటలకు ఉచితంగా కరెంట్ ఇచ్చి చూపించిండు.. ఎవుసానికి సీజన్‌కు ముందే పెట్టుబడి డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాడు.. ఇంటిం టికీ శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నాడు.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పింఛన్ డబ్బులను ప్రతినెలా అందిస్తూ ఆదుకుంటున్నాడు.. చెరు వులను బాగు చేయడంతోపాటు నీళ్లు, విద్యుత్తు, పరిశ్రమలు, ఉద్యోగాలను కల్పించారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ యావత్ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని వారు పేర్కొంటున్నారు.
దేశాన్ని కూడా ఇలాగే బాగుచేసే సత్తా ఆయనకే ఉందని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో సామాన్యులపై మోయలేని భారం పడుతున్నది. ఓ పక్క సీఎం కేసీఆర్ ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ఆ నిధులను ఆవిరి చేస్తున్నదని వారు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల అభివృద్ధితో ప్రజల్లో తమకు గౌరవం పెరిగిందని, ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుండటంతో ఆర్థిక భరోసా ఏర్పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ వైపు దేశ ప్రజల చూపు
బంగారు భారత్ నిర్మాణం కోసం దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఉద్యమ నేతగా తెలంగాణను సాధించి అభివృద్ధి చేసిన విధంగానే.. భారతదేశాన్ని కూడా ప్రగతి పథంలో నిలపాలి. భావితరాల కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అభివృద్ధి చేయాలన్న తపన ఉన్న నాయకుడే దేశప్రధాని కావాలి.
– గరివప్ప, అగ్గనూరు ఎంపీటీసీ,యాలాల మండలం
దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు..
కేంద్రంలోని బీజేపీ పాలనపై దేశ ప్రజలు విసిగిపోతున్నారు. నవభారత నిర్మాణానికి బీజేపీని గద్దె దించాలని, నూతన నాయకత్వం కావాలని మార్పును కోరుకుంటున్నారు. 75 ఏండ్లుగా రైతుల బతుకులు మారలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తమవుతాయి.
– రాములు, ఎంపీటీసీ, బొంపల్లి ,దోమ మండలం
ప్రజలు ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్
దేశ ప్రజలు ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుతుండ్రు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తమైతే పేద ప్రజలకు మేలు జరుగుతది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందుతాయి. దేశ ప్రజలందరూ మన రాష్ట్ర సంక్షేమ పథకాలను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
– కొందూటి నరేందర్,మున్సిపల్ చైర్మన్ షాద్‌నగర్
కేంద్రం తీరు సరికాదు..
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. ఈడీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పుతూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నది. బీజేపీ నాయకుల తీరును చూసి జనం చీదరించుకుంటున్నారు. బీజేపీయేతర రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– బొప్పిడి గోపాల్, రావిచేడ్ ఎంపీటీసీ, కడ్తాల్ మండలం
దేశ రాజకీయాల్లో మార్పొస్తది..
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. జాతీయ పార్టీ పెడితే దేశ రాజకీయాల్లో వినూత్న మార్పు వస్తుంది. ఇప్పటికే బీజేపీలో వణుకుపుడుతున్న మాట వాస్తవం. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ పథకాలు దేశవ్యాప్తమవుతాయి. దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
– సరితా రాజునాయక్,ఎంపీటీసీ, మోకిల
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే దేశం ప్రగతి చెందుతుంది. దేశాన్ని అన్నిరంగాల్లో ముందుంచగలిగే సత్తా కేవలం సీఎం కేసీఆర్‌కే ఉన్నది. కేంద్రలోని బీజేపీ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– సత్యం, రైతు సంఘం మండలం అధ్యక్షుడు, కోట్‌పల్లి
ఎన్డీఏ కూటమికి పరాభవం తప్పదు..
భారతదేశంలో పాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమికి రానున్న రోజుల్లో పరాభవం తప్పదు. దేశంలో అన్నిరకాల వస్తువులపై జీఎస్టీతో పాటు ధరలను పెంచి నిరుపేదలు బతకలేని పరిస్థితి నెలకొన్నది. ప్రజలు బీజేపీ పాలనపై విసుగు చెంది ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడే కూటమికి మంచి స్పందన లభిస్తోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ మాదిరిగానే దేశం బాగుపడుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
– జమాల్‌ఖాన్, మండల కోఆప్షన్ మెంబర్, కొత్తపేట,కేశంపేట మండలం
దేశ రాజకీయాలను మలుపు తిప్పే శక్తి ఉంది..
సీఎం కేసీఆర్‌కు దేశ రాజకీయాలను మలుపుతిప్పే శక్తి ఉంది. దేశంలో అధికార పార్టీకి సరైన ప్రత్యామ్నాయ లేకపోవడంతో జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలలో కేసీఆర్ తన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. కేసీఆర్ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే రాష్ర్టాలకు సముచిత ప్రాధాన్యం లభించడంతో పాటు తెలంగాణ మాదిరిగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి. దేశం అభివృద్ధి చెందుతుంది.
– జంగం జగదీష్, ఎంపీటీసీ రేగడిమైలారం, బొంరాస్‌పేట మండలం
కేసీఆర్‌తోనే దేశం సుభిక్షంగా మారుతుంది..
దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ప్రజలు పడుతున్న బాధలను చూసి సీఎం కేసీఆర్ చలించిపోయారు. నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి పాలన అందించాలి. కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. రోజు రోజుకు గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజలను నరకయాతన పెడుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ, కోట్‌పల్లి