పెద్దేముల్, సెప్టెంబర్ 17 : మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులోని జడ్ అండ్ బీ మినిరల్స్ కార్పొరేషన్ సుద్ద ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, ఫ్యాక్టరీ మేనేజర్ నీరజ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరుకు చెందిన బాబర్, అతడి కుమారుడు నవీద్(అతిఫ్)లు సుద్ద ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నారు. కాగా ఈ నెల 15వ తేదీ గురువారం రాత్రి ఫ్యాక్టరీలో చోరీ జరిగింది. రూ.60వేల విలువ చేసే మొత్తం 6 మోటర్లు, రూ.2 లక్షల 40వేల విలువ చేసే రైమండ్ మిల్ రోలర్లు 4, రూ.60వేల విలువ చేసే ఫైర్ వార్, హౌసింగ్, గేర్‌బాక్స్, బట్టి స్టాండ్, ఫ్యాన్, మోటార్లు తదితర వస్తువులను విప్పి దుండగులు అపహరించారు. కాగా ఈ నెల 16వ తేదీ శుక్రవారం ఫ్యాక్టరీ మేనేజర్ నీరజ్ వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గమనించి యజమాని నవీద్(అతిఫ్)కు సమాచారం ఇచ్చాడు.
యజమాని నవీద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫ్యాక్టరీలో మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తుండగా, 10 మంది లోకల్ లేబర్కాగా, మిగతా ఆరుగురు బీహార్ రాష్ర్టానికి చెందినవారు. చోరీ జరిగిన రోజు నుంచి బీహార్ కార్మికులు కనపడలేదు. కార్మికులే ఈ చోరీకి పాల్పడినట్లు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.