రంగారెడ్డి, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా బీఎల్వోలు(బూత్ స్థాయి అధికారులు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు ఐడీ కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ..ప్రతీ ఓటరు తమ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సూచిస్తుంది. అంతేకాకుండా ఓటరు ఐడీ కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియపై జిల్లాలోని ఊరూరా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఆధార్ వివరాలను సేకరించి, క్షేత్రస్థాయిలోనే ట్యాబ్‌ల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 31,61,222 మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు 1,97,995 ఓటరు గుర్తింపు కార్డులకు సంబంధించి ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయ్యింది.
ఇప్పటివరకు 1,97,995 ఓటరు కార్డులకు ఆధార్ సీడింగ్..
ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానానికి సంబంధించి ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,97,995 ఓటరు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. అయితే అత్యధికంగా చేవెళ్ల నియోజకవర్గంలో 59,036 ఓటరు కార్డులు, కల్వకుర్తి నియోజకవర్గంలో 42,886 ఓటర్కార్డులకు, రాజేంద్రనగర్‌లో 26,554, షాద్‌నగర్‌లో 25,275, మహేశ్వరం నియోజకవర్గంలో 17,695, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 13,980, శేరిలింగంపల్లిలో 7990, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 4579 ఓటరు గుర్తింపు కార్డులకు ఇప్పటివరకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యింది. మరోవైపు ఆధార్ అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకుగాను ప్రత్యేక కార్యక్రమాలను కూడా జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టింది.
ఆయా శాఖలకు కూడా బాధ్యతలను అప్పగించారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల వివరాలు, మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లోని ఓటర్ల వివరాలు, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మహిళల వివరాలను అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఓటర్ల నుంచి ఆధార్ వివరాలను సేకరించి సీడింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈనెల 13 నుంచి 24 వరకు కాలేజీల్లోని విద్యార్థుల నుంచి విద్యాశాఖ, ఇంటర్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో, ఈనెల 19 నుంచి 24 వరకు ఎన్జీవోల ఆధ్వర్యం, ఈనెల 26 నుంచి 30 వరకు జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఓటర్ల ఆధార్ వివరాలను జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో, అక్టోబర్ 2 వరకు యువజన సర్వీసుల ఆధ్వర్యంలో యువజన సంఘాల సభ్యుల నుంచి ఆధార్ వివరాలను సేకరించి, నేరుగా బీఎల్వోలు ఆధార్ సీడింగ్ పూర్తి చేస్తున్నారు.
జిల్లాలో 31,61,222 మంది ఓటర్లు..
జిల్లాలో మొత్తం 31,61,222 మంది ఓటర్లుండగా, పురుషులు 16,45,535 మంది ఓటర్లు, మహిళలు-15,14,536, ఇతరులు-384, ఎన్ఆర్ఐ ఓటర్లు-182, సర్వీస్ ఓటర్లు 585 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 2,88,914 మంది ఓటర్లుండగా పురుషులు1,47,359 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు-1,41,475, ఇతరులు 80 మంది ఓటర్లున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 5,57,142 మంది ఓటర్లుండగా, పురుషులు-2,91,749, మహిళా ఓటర్లు 2,65,229, ఇతరులు-164 ఓటర్లున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 4,89,111 మంది ఓటర్లుండగా, పురుషులు 2,52,412, మహిళలు 2,36,508, ఇతరులు 191 మంది ఓటర్లున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 5,02,974 మంది ఓటర్లుండగా పురుషులు 2,64,423, మహిళలు 2,38,347, ఇతరులు-204 మంది ఓటర్లున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 6,64,205 మంది ఉండగా, పురుషులు 3,53,450, మహిళలు 3,10,524, ఇతరులు 231 మంది ఓటర్లున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,629 మంది ఉండగా, పురుషులు 1,21,407, మహిళా ఓటర్లు 1,16,143 మంది, ఇతరులు 79 మంది ఓటర్లున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,17,534, పురుషులు 1,11,291, మహిళలు 1,06,107, ఇతరులు 136 ఓటర్లున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,03,713 మంది ఓటర్లుండగా, పురుషులు 1,03,444, మహిళలు 1,00,203, ఇతరులు 66 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 3307 పోలింగ్ కేంద్రాలుండగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 316 పోలింగ్ కేంద్రాలు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 545, మహేశ్వరంలో 511, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 535, శేరిలింగంపల్లిలో 590, చేవెళ్లలో 298, కల్వకుర్తి నియోజకవర్గంలో 262, షాద్‌నగర్ నియోజకవర్గంలో 250 పోలింగ్ కేంద్రాలున్నాయి.
ఇంటింటికీ బీఎల్వోలు..
సాధారణ ఎన్నికల వరకు బోగస్ ఓట్లకు చరమగీతం పాడుతూ ఓటర్ల జాబితాను పక్కాగా తయారు చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓటర్లకు సంబంధించిన ఆధార్ నంబర్‌ను ఓటర్ల జాబితాలోని పేర్లకు అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నది. కాగా, ఒక్కొక్కరికీ రెండుమూడు చోట్ల ఓట్లు ఉంటే ఒకేచోట ఓటుహక్కు వినియోగించుకునేలా బోగస్ ఓట్లన్నీ తొలగిపోనున్నాయి. ఆగస్టు ఒకటవ తేదీన ప్రారంభమైన ఆధార్‌తో అనుసంధానం ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 45.36శాతం ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం జరిగింది. మిగతా వాటికి సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఆధార్ అనుసంధానం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తద్వారా రాబోయే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో పక్కాగా ఓటరు జాబితాను రూపొందించనున్నారు.
జిల్లాలో 3,95,298 ఓటర్లకు ఆధార్ అనుసంధానం..
వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 395298 మంది ఓటర్లకు సంబంధించిన (45.36శాతం) ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తయింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 8,71,391 మంది ఓటర్లుండగా ఇప్పటివరకు 3,95,298(45.36శాతం) మంది ఓటర్లకు సంబంధించిన ఆధార్ అనుసంధానం పూర్తయింది. ఇంకా 4,76,093 మంది ఓటర్లకు సంబంధించిన ఆధార్ అనుసంధానం చేపట్టాల్సి ఉన్నది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పరిగి నియోజకవర్గంలో 2,30,422 మంది ఓటర్లుండగా 1,13,695(49.34శాతం) మంది ఓటర్ల ఆధార్ అనుసంధానం పూర్తవగా 1,16,727 మందికి సంబంధించి చేపట్టాల్సి ఉన్నది. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,09,659 మంది ఓటర్లుండగా 73,166(34.90శాతం) మంది ఓటర్లకు సంబంధించి ఆధార్ అనుసంధానం చేపట్టగా 1,36,493 మంది ఓటర్లకు సంబంధించి ఆధార్ అనుసంధానం చేపట్టాల్సి ఉన్నది. తాండూరు నియోజకవర్గంలో 2,17,462 మంది ఓటర్లుండగా ఇప్పటివరకు 95,521(43.93శాతం) ఓటర్ల ఆధార్ అనుసంధానం చేపట్టగా 1,21,941 మందికి సంబంధించి చేపట్టాల్సి ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో 2,13,848 మంది ఓటర్లుండగా ఇప్పటివరకు 1,12,916(52.80శాతం) మంది ఓటర్ల ఆధార్ అనుసంధానం పూర్తవగా 1,00,932 మందికి సంబంధించి ఆధార్ అనుసంధానం చేపట్టాల్సి ఉన్నది.
ఇంటింటికీ తిరిగి ఆధార్ అనుసంధానం..
జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల ఆధార్‌కార్డు నెంబర్ సేకరించి ఓటర్ల జాబితాతో అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1130 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో 305 మంది, వికారాబాద్‌లో 284, తాండూరులో 266, కొడంగల్‌లో 275 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఆధార్‌కార్డు ద్వారా ఓటర్ కార్డుకు అనుసంధానం చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లాలో 113 మంది సూపర్వైజర్లతోపాటు తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు.
లెక్క తేలనున్న పక్కా ఓటర్లు..
ఓటర్ల జాబితాలోని పేరుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం ద్వారా పక్కా ఓటర్ల లెక్క తేలనున్నది. గ్రామాల్లో ఒకేచోట ఉండేవారు తమ పేరును ఒకే దగ్గర ఓటరుగా నమోదు చేసుకోవడం జరిగింది. తమ పిల్లల చదువుల కోసం, ఉద్యోగరీత్యా, ఇతర కారణాల వల్ల పట్టణాల్లో నివాసముంటున్న వారు గ్రామాలు, పట్టణాలు రెండుచోట్ల తమ పేర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ రెండు ఎన్నికల్లోను వారు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
సాధారణ ఎన్నికల్లోనూ రెండు ప్రాంతాల్లో ఓటు ఉంటే రెండు చోట్ల తమ ఓటుహక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఓటర్ల జాబితాకు ఆధార్ నంబర్ అనుసంధానం ప్రక్రియతో ఇలాంటి వాటికి చెక్ పడనున్నది. ఓటరు కోరుకున్న ఒకేచోట ఓటుహక్కు కలిగి ఉండే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా బోగస్ ఓట్లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుంది. ఈ ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఫిబ్రవరి నెల వరకు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించగా అంతలోపే పూర్తి చేసే విధంగా జిల్లాలోని అధికారులు పని చేస్తున్నారు.