బడంగ్‌పేట, సెప్టెంబర్ 11: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరులో ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. 400 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లెటూరి నుంచి నగరానికి వెళ్లి వైద్యం చేయించుకోలేని వారికి మెడికల్ క్యాంపులు దోహద పడుతాయని అన్నారు. వానకాలంలో ప్రజలు తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. గ్రామ గ్రామాన ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఆర్ట్ ఫౌండేషన్ సీఈవో తీగల త్రిషారెడ్డి ఉచిత వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలూరు గ్రామ సర్పంచ్ మద్ది సురేఖా కర్ణాకర్‌రెడ్డి, వైద్యులు, స్థానిక నాయకులు ఉన్నారు.
ఉచిత వైద్య శిబిరం
సరూర్‌నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీ సీనియర్ సిటిజన్స్ కార్యాలంలో ఆదివారం స్పిండ్ డయాగ్నొస్టిక్స్ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి బీపీ, ఘగర్తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్పిండ్ డయాగ్నొస్టిక్స్ వారు ముందుకు వచ్చి సీనియర్ సిటిజన్స్ వారికి కాలనీలో వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్ఎన్ శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు కె.చంద్రయ్య, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్, కృష్ణయ్య, దయాకర్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.