రంగారెడ్డి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండడంతో అవి పెరిగి రెండు, మూడేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. రెండేండ్లుగా వానకాలం సీజన్లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులన్నీ పుష్కలంగా నిండి నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా సాగునీరు పెరుగుతుండడంతో పంటల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో 2 లక్షల ఎకరాల్లో ఉన్న ఆయా పంటల సాగు విస్తీర్ణం సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం, సాగునీరు గణనీయంగా పెరగడంతో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం 4 లక్షలకు పెరిగింది.
ఈ వానకాలంలో భారీ వర్షాలు..
ఈ వానకాలం సీజన్లో జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ వానకాలం సీజన్లో జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 506 మి.మీటర్ల వర్షపాతంకాగా, సాధారణానికి మించి 704 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. జులై మాసంలో అత్యధికంగా 346 మి.మీటర్ల వర్షపాతంకాగా, సాధారణ వర్షపాతంతో పోలిస్తే జులై నెలలో 126 మి.మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. ఈ ఏడాది వానకాలం సీజన్లో జూన్లో సాధారణ వర్షపాతం 91.7 మి.మీటర్లుకాగా 126 మి.మీటర్లు, జులై నెలలో సాధారణం 153 మి.మీటర్లుకాగా, 346.1 మి.మీటర్ల వర్షపాతం, ఆగస్టు మాసంలో సాధారణ వర్షపాతం 140.9 మి.మీటర్లుకాగా, 155.8 మి.మీటర్ల వర్షపాతం, సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం 121 మి.మీటర్లుకాగా, ఇప్పటివరకు 76.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్లో 37.4 మి.మీటర్లు, జులైలో 126.2 మి.మీటర్లు, ఆగస్టు నెలలో 10.6 మి.మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది.
పెరిగిన సాగు విస్తీర్ణం..
వానకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 3,63,947 ఎకరాల్లో ఆయా పంటల సాగయ్యింది. ఈ ఏడాది పత్తి పంటను అత్యధికంగా జిల్లా రైతాంగం సాగు చేశారు. పత్తి పంట 1,57,945 ఎకరాల్లో పత్తి పంట సాగయ్యింది. వరి 1,08,237 ఎకరాలు, జొన్న 3403 ఎకరాలు, చిరుధాన్యాలు 8 ఎకరాలు, మొక్కజొన్న 73,182 ఎకరాలు, రాగులు-12 ఎకరాలు, కందులు-17,635 ఎకరాలు, మినుములు-25 ఎకరాలు, పెసర్లు-79 ఎకరాలు, చెరకు 11 ఎకరాలు, ఆముదం 22 ఎకరాలు, సోయాబీన్ 58 ఎకరాలు, వేరుశనగ 3 ఎకరాలు, ఇతర పంటలు 3327 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.