ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11 : జీఓ 317ఉత్తర్వుల ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భావి భారత పౌరులను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చటానికి ప్రభుత్వం కృతినిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణలో విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌గౌడ్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వత్‌రెడ్డి, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఎస్టీయూ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు భుజంగరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజమణి, ప్రవీన్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఏవీ సుధాకర్, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.