బొంరాస్‌పేట, సెప్టెంబర్ 10 : గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు స్థానికంగానే పనులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి ఏడాదిలో వంద రోజులపాటు పని కల్పిస్తారు. ఈ పథకంలో చేపట్టే పనులు, కూలీలకు చేసే చెల్లింపులు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం ఉపాధి పనులపై ప్రతి ఏడాది సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పనులు చేపట్టారో వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు పరిశీలిస్తారు. అనంతరం మండలస్థాయిలో ప్రజా వేదిక సభ నిర్వహించి సామాజిక తనిఖీపై గ్రామాలవారీగా నివేదికలను ప్రజాప్రతినిధుల సమక్షంలో చదివి వినిపిస్తారు.
కరోనా కారణంగా మూడేండ్ల నుంచి సామాజిక తనిఖీలు నిర్వహించడంలేదు. కరోనా తగ్గడంతో ప్రభుత్వం మళ్లీ ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మండలంలో శనివారం నుంచి తనిఖీ బృందాల క్షేత్రస్థాయి పనులపే ప్రారంభించారు. ఈ నెల 19 వరకు గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టిన పనులను పరిశీలిస్తారు. తనిఖీ సిబ్బంది ఇప్పటికే మండల కార్యాలయంలో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎస్ఆర్పీ, 20 మంది డీఆర్పీలు, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల సాయంతో పనుల పరిశీలన చేపడుతారు. శనివారం లింగన్‌పల్లి, అల్లికాన్పల్లి, దుద్యాల, మదన్‌పల్లి, బుర్రితండా, దుప్‌చెర్ల, నాగిరెడ్డిపల్లి, చౌదర్పల్లి గ్రామాల్లో తనిఖీ బృందాలు పర్యటించి ఉపాధి పనులను పరిశీలించారు.
మూడేండ్లలో రూ.20 కోట్ల పనులు
కరోనా కారణంగా మూడేండ్లుగా సామాజిక తనిఖీ నిర్వహించలేదు. అందువల్ల ఈ ఏడాది మూడేండ్ల కాలంలో చేసిన పనులపై తనిఖీ నిర్వహించనున్నారు. బొంరాస్‌పేట మండలంలో 1 మార్చి 2019 నుంచి 31 మార్చి 2022 వరకు రూ.20 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారు. పొలాల్లో భూమి లెవలింగ్, పంట కల్లాల నిర్మాణం, చెరువులు, కుంటల్లో ఒండ్రుమట్టి తొలగింపు, కంపోస్టు షెడ్ల నిర్మాణం, పాటు కాలువల మరమ్మతులు, నర్సరీల్లో మొక్కల పెంపకం, మొక్కలు నాటడం, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక పనులను చేపట్టారు. ఈ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను తీసుకుని సామాజిక తనిఖీ సిబ్బంది పని ప్రదేశానికి వెళ్లి వాస్తవంగా పని జరిగిందా.. కొలతల ప్రకారం ఎంబీలో రికార్డు చేశారా.. మస్టర్లో నమోదు చేసిన కూలీలకు చెల్లింపులు నిబంధనల ప్రకారం చేశారా వంటి అంశాలను సిబ్బంది పరిశీలిస్తారు. చేసిన పనిలో ఏమాత్రం తేడా ఉన్నా మండలస్థాయిలో నిర్వహించే ప్రజా వేదికలో చదివి పనులవారీగా ఎంత మేరకు అవినీతి జరిగిందో సంబంధిత బాధ్యుల నుంచి రికవరీ చేయడానికి నిర్ణయిస్తారు.