బొంరాస్‌పేట, సెప్టెంబర్ 8: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా బొంరాస్‌పేటలో 11.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. బుధ వారం రాత్రి 8 గంటల నుంచి ఉరుములు,మెరుపులతో ప్రారంభమైన వాన ఏకధాటిగా గంటన్నర పాటు కురిసింది. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చిన్నవాగు ప్రాజెక్టు అలుగు ఉధృతికి బురాన్‌పూర్-మదన్‌పల్లి మధ్యన ఉన్న కల్వర్టు వదరకు కొట్టుకు పోయింది. దీంతో మండల కేంద్రానికి, బొంరాస్‌పేట నుంచి వికారాబాద్‌కు రాకపోకలు స్తంభించిపోయాయి.
మదన్‌పల్లి, మదన్‌పల్లితండా, నర్స్యానాయక్తండా, దరికింది తండాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు రాలేకపోయారు. మెట్లకుంట ఎల్లమ్మ చెరువు అలుగు నీరు ఉధృతంగా ప్రవహించడంతో మెట్లకుంట నుంచి బుర్రితండా మధ్యన ఉన్న ఎల్లమ్మ వాడుక రోడ్డుపై నుంచి నీరు పారుతుంది. దీంతో గురువారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. బొంరాస్‌పేట పెద్ద చెరువు అలుగు ఉధృతంగా పారడంతో వరద నీరు బొంరాస్‌పేట-తుంకిమెట్ల మధ్యన ఉన్న రోడ్డు వంతెనపై నుంచి వెళ్తుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చాలా మంది ప్రయాణికులు, వాహనదారులు, బొంరాస్‌పేట ఉన్నత పాఠశాలకు వచ్చే టీచర్లు వరద నీటిలో రాలేక గట్టుపైనే ఉండిపోయారు. బాపన్ చెరువుతండా పంచాయతీ పరిధిలోని గిర్కబాయితండాకు వెళ్లే రోడ్డుపై కల్వర్టు తెగిపో వడంతో తండా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. మెట్లకుంట ఎల్లమ్మ చెరువు అలుగు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ వరి పొలాలను ముంచెత్తింది. వరద నీటిలో వరి చేలు మునిగిపోయాయి. రేగడిమైలారంలో బలిజ శేఖర్‌కు చెందిన రెండు ఎకరాల వరిపంట నీటిలో మునిగిపోయింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండ లంలోని తుంకిమెట్ల, చౌదర్పల్లి, కొత్తూరు, వడిచెర్ల చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలకు మండలంలోని నోటిఫైడ్ చెరువులు అన్నీ నిండి అలుగులు పారుతున్నాయి.
కల్వర్టును పరిశీలించిన ఏఈ
భారీ వర్షానికి మదన్‌పల్లి-బురాన్‌పూర్ గ్రామాల మధ్య వరద నీటికి కొట్టుకుపోయిన వంతెనను పంచాయతీరాజ్ ఏఈ రవికిరణ్, మండల వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, బురాన్‌పూర్ సర్పంచ్ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, ప్రకాశ్‌గౌడ్, సంగప్ప ఉదయం పరిశీలించారు. వంతెన తెగిపోయిన విషయాన్ని వారు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఏఈని తీసుకెళ్లి చూపించాలని నాయకులను ఆదేశించారు. వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
వంతెన తెగిపోయినందున మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు, జిల్లా కేంద్రానికి వెళ్లే వారికి ఇబ్బందులు వస్తాయని తాత్కాలికంగా మట్టిపోసి రాకపోకలు జరిగేలా చూడాలని సర్పంచ్‌ను ఎమ్మెల్యే ఆదేశించారని నాయకులు చెప్పారు. కొత్త వంతెన నిర్మాణానికి రూ.40 లక్షల వ్యయం అవుతుందని ఏఈ తెలుపగా అంచనాలు తయారు చేసి పంపిస్తే నెల రోజుల్లో నిధులు మంజూరు చేయించి కొత్త వంతెన నిర్మిస్తామని ఎమ్మెల్యే చెప్పినట్లు వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, దేశ్యానాయక్ చెప్పారు. తుంకిమెట్ల నుంచి బొంరాస్ పేటకు వచ్చే రోడ్డుపై నుంచి అలుగు నీరు పారి రాకపోకలు నిలిచిపోయిన విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని ప్రస్తుతమున్న వంతెన స్థానంలో కొత్త దానిని నిర్మాంచాల్సిన అవసరం గురించి ఎమ్మెల్యేకు వివరించామని వారు తెలిపారు.
కొడంగల్‌లో 83.4 మి.మీ వర్షపాతం
కొడంగల్, సెప్టెంబర్ 8: కొడంగల్ పట్ణణంలో బుధవారం 83.4 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు తహసీల్దార్ బుచ్చయ్య తెలిపారు. మండలంలోని చిట్లపల్లి గ్రామ పరిధిలోని పోచమ్మతండా వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవ హించడంతో తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వాగుపై వంతెన నిర్మాణం జరుగుతుండగా వంతెన పిల్లర్లపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. దాం తో పొచమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని మైసమ్మతండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఎక్కడి వారి అక్కడే ఉండిపోయారు. వంతెన నిర్మాణం పూర్తయితే రెండు తండాల వాసులకు వరద బాధ తప్పతుందని తండా వాసులు పేర్కొంటున్నారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, సెప్టెంబర్ 8: తాండూరు నియోజకవర్గంలో మూడు రోజులుగా కురుస్తున్న వానతో తాండూరు కాగ్నానది, యాలాల కాక్రావేణి నది పొంగి పొర్లు తోంది. మున్సిపల్ పరిదిలోని లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. తాండూరు-కోడంగల్ మార్గంలోని కాగ్నానది పాత వంతెన కూలిపోయింది. గురువారం యాలాల మండలం ముద్దాయిపేట చిన్నవాగు అలుగు పారడంతో సమీపంలోని కోళ్లఫారంలోకి వరద నీరు చేరింది. దీంతో కోళ్లఫారం పూర్తిగా నీట మునగడంతో కోడి పిల్లలు మృతి చెందాయి. యజమాని అలీముద్దిన్కు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపాడు.
ముందస్తుగా రాకపోకలు నిలిపివేత
ధారూరు, సెప్టెంబర్ 8: దోర్నాల్-ధారూరు స్టేషన్ (కాగ్నా)వాగు పొంగి పొర్లుతుంది. దీంతో దోర్నాల్, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మరిపల్లి, దోర్నాల్ తండా తదితర గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యగా ధారూరు పోలీసులు రాకపోకలను ఆపేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చిన్న చిన్న వాగులు కుంటలలో భారీగా నీరు చేరుకుంది. పంట పొలాలు నీటితో నిండిపోయాయి.
పెద్దేముల్ మండలంలో..
పెద్దేముల్, సెప్టెంబర్ 8: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. కందనెల్లితండా, గాజీపూర్, బుద్దారం, కందనెల్లి, మంబాపూర్, జన గాం, మారేపల్లి, పెద్దేముల్, నాగులపల్లి,తట్టేపల్లి,అడికిచెర్ల,ఇందూరు,గొట్లపల్లితోపాటు ఆయా గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. కురిసిన వర్షానికి పంట పొలాల్లో వరదనీరు వచ్చిచే రింది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండు కుండలా మారిపోయాయి.
వాగు దాటుతుండగా బైకు గల్లంతు
దోమ,సెప్టెంబర్8; బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బుద్లాపూర్, బ్రాహ్మణపల్లి మధ్య ప్రవహించే కాక్రవేణి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి భీమేశ్ అనే వ్యక్తి తన బైక్‌పై దిర్సంపల్లి గ్రామానికి చెందిన బంధువుల దగ్గర కు వస్తున్న క్రమంలో వాగు ఉధృతికి బైక్‌తో పాటు తాను కొట్టుకుపోయాడు.తాను క్షేమంగా బయటపడ్డప్పటికీ బైక్ మాత్రం కనిపించకుండా పోయింది.