పరిగి, సెప్టెంబర్ 8 : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియాతోపాటు ఆదాయం పెంచుకుంటున్న టీఎస్ ఆర్టీసీ మరింత ఆదాయం పెంపునకు వివిధ మార్గాలను అన్వేషించి అమలు చేస్తున్నది. తమ సంస్థకు సంబంధించిన స్థలాల్లో దుకాణాల సముదాయాలను నిర్మించి ఆదాయం పొందడానికి ప్రణాళికలు రచించి అమలుచేస్తున్న ఆర్టీసీ.. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ సంస్థకు సంబంధించిన స్థలాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి మరింత ఆదాయం పెంచుకోనుంది.
ఇందులో భాగంగా వ్యాపారం చక్కగా సాగుతుందనుకున్న ప్రదేశాలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో మూడు డిపోలున్నాయి. పరిగి డిపోలో 78 బస్సులకు రోజూ సుమారు రూ.10లక్షలు., తాండూరులో 84 బస్సులకు రూ.10లక్షలు., వికారాబాద్‌లో 69 బస్సులకు రోజూ సుమారు రూ.7లక్షల వరకు ఆదాయం చేకూరుతున్నది. వివిధ ప్రాంతాల్లో 46 కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. వాటిలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్, పరిగిలో పెట్రోల్ బంకుల ఏర్పాటు చేపట్టనున్నారు. అలాగే తాండూరు, కొడంగల్‌లో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నది.
ప్రధాన రహదారుల్లోని ఆర్టీసీ స్థలాల సద్వినియోగం
వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు ప్రధాన పట్టణాలైన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌లలో ప్రధాన రహదారుల పక్కనే ఆర్టీసీకి స్థలాలు ఉండడం కలిసి వచ్చే అంశం. ఇప్పటికే ఈ స్థలాల్లో దుకాణాల సముదాయం ద్వారా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్న సంస్థ.. మొదటి విడుతలో జిల్లాలోని పరిగి, వికారాబాద్‌లలో రెండు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిర్ణయించింది. దీని కోసం మూడు చమురు కంపెనీలతో ఒప్పందం కుదిరిన సందర్భంగా పరిగిలో ఐవోసీఎల్, వికారాబాద్‌లో బీపీసీఎల్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం పెట్రోల్ బంకుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. డిపోల పక్కనే ఏర్పాటు చేయబోయే పెట్రోల్ బంకులను సంస్థ ఆధ్వర్యంలో, మిగతా వాటిని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సొంతంగా పెట్రోల్ బంకుల నిర్వహణ చేపడితే స్థలాలకు ఆయా చమురు సంస్థల నుంచి లీజు అద్దెతోపాటు చమురు కంపెనీలు ఇచ్చే పూర్తి కమీషన్ ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.2.83, డీజిల్‌పై రూ.1.89 చొప్పున సమకూరుతుంది.
అనుకూలమైన స్థలాల్లో పెట్రోల్ బంకులు
ఆర్టీసీ సంస్థకు సంబంధించిన స్థలాలు చాలా చోట్ల ఉన్నప్పటికీ వ్యాపారాభివృద్ధికి అనుకూలమైన స్థలాల్లోనే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిగిలోని ఆర్టీసీ డిపోకు ఒక చివరన హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పెట్రోల్ బంకు నిర్మాణం చేపట్టనున్నారు. వికారాబాద్‌లో బస్టాండ్ వద్ద పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ రెండు చోట్ల కూడా వ్యాపారం బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోల్ బంకులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తే ఎలాంటి కల్తీ లేకుండా పెట్రోల్, డీజిల్ అందనుందని ప్రజలు భావిస్తున్నారు. వీటితోపాటు తాండూరు, కొడంగల్‌లో సైతం పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంస్థ ఆలోచిస్తున్నది. ఈ రెండుచోట్ల కూడా ప్రధాన రహదారి పక్కనే సంస్థకు స్థలాలు ఉండడంతో పెట్రోల్ బంకుల ఏర్పాటుతో మంచి ఆదాయం పొందవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల సంస్థ ఆదాయం వృద్ధికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్న యాజమాన్యం.. జిల్లాలో పెట్రోల్ బంకుల ఏర్పాటుతో మరింత ఆదాయం చేకూరనున్నది.
రెండు పెట్రోల్ బంకులు ఏర్పాటు
– జ్యోతి, డివిజనల్ మేనేజర్, టీఎస్ఆర్టీసీ
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి ఆర్టీసీ స్థలాల్లో రెండు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంస్థ నిర్ణయించింది. ఈ రెండుచోట్ల పెట్రోల్ బంకుల ఏర్పాటు తర్వాత నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే తాండూరు, కొడంగల్‌లో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటు ఆలోచన ఉన్నది. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు నిర్ణయించాల్సి ఉన్నది. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో టీఎస్ ఆర్టీసీ సంస్థకు మరింత ఆదాయం చేకూరనున్నది.