చేవెళ్లటౌన్, ఆగస్టు 29 : మట్టి వినాయకుల వల్ల పర్యావరణానికి హాని కలుగదు. శతాబ్ద కాలంగా కాలుష్య సమస్య జీవరాశులపై పడుతున్నది. రంగుల వినాయకుల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, కృత్రిమ రంగుల వాడకంలో పాదరసం, క్రోమియం, సీసం, లెడ్, అర్సీనిక్ వంటి విషపూరిత రసాయనాలతో తయారైన వినాయకులను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల నీళ్లల్లో ఉండే జీవరాశి మృతి చెందుతున్నాయి. నీటిలో పండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రజల్లో మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్, జీర్ణకోశ సంబంధ వ్యాధులు, చర్మసంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వ్యర్థాలు నీటిలో కరుగకపోవడం వల్ల చెరువుల్లో పూడిక చేరి నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతున్నాయి. మట్టి వినాయకులు నీటిలో కరుగడంతో పాటు ఎటువంటి నష్టం ఉండదు. నిమజ్జనం కారణంగా ఏటా 10వేల టన్నుల రసాయన వ్యర్థ్ధాలు భూమిలో చేరుతున్నాయి. భూమిలో ఉన్న 71శాతం జలరాశిలో, 68 శాతం సముద్ర జలాలే… 2శాతం మంచుతో కప్పబడి ఉన్నది. మిగిలిన ఒక శాతం నీటినే అవసరాలకు వాడుతున్నాం.
మట్టి గణపతులు సిద్ధం..
మంచాల ఆగస్టు 29 : పర్యావరణ హిత గణపతులను కొనుగోలు చేసేందుకు చాలా మంది మక్కువ చూపుతున్నారు. మంచాల గ్రామానికి చెందిన ఏరుకొండ అనిత, మహేశ్ దంపతులు మట్టి వినాయకులు తయారు చేసి ప్రకృతి సిద్ధమైన కలర్లను ఉపయోగిస్తున్నారు. రూ.50 నుంచి రూ.100 వరకు ధర నిర్ణయించారు.
షాద్‌నగర్‌లో వినాయకుల సందడి
షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 29 : వినాయక చవితి ముందుగానే షాద్‌నగర్‌లో చవితి సందడి మొదలైంది. షాద్‌నగర్ వినాయక గంజ్ వద్ద వినాయక ప్రతిమల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వినాయక ప్రతిమలను తీసుకొచ్చి మున్సిపాలిటీలోని పలు చోట్ల విక్రయాలు జరుపుతారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల వారు వినాయక ప్రతిమలను కొనుగోలు చేస్తారు. అదే విధంగా వినాయకుడికి ఇష్టమైన లడ్డు తయారీతో స్వీట్ దుకాణాలు బిజీగా ఉన్నాయి. మరో వైపు బట్టల వ్యాపారులు వినాయక మండపానికి సంబంధించిన డిజైన్ల బట్టలు, నిమజ్జనం రోజున యువత ధరించే బట్టలను సిద్ధంగా ఉంచారు. పట్టణంలో సుమారు ఫీట్ నుంచి 16ఫీట్ల వరకు వివిధ రకాల గణేశ్ ప్రతిమలను సిద్ధంగా ఉంచారు. రాజసం ఉట్టిపడేలా ఛత్రపతి శివాజీ, శివపార్వతులతో, సిద్ధి బుద్ధితో, వేంకటేశ్వరస్వామితో, నంది, మయూర, నాగశేషుడితో కూడిన వినాయక ప్రతిమలు చూపరులను ఆకర్శిస్తున్నాయి. అయోధ్య శ్రీరాముడిలా, చిన్న బాలుడిగా, ఖైరతాబాద్ గణేశ్‌ని తలపించేలా చిన్న గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రజల్లో మార్పు వస్తున్నది..
ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. 17ఏండ్లుగా పర్యావరణ పరిరక్షణకు పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా మట్టి వినాయకులను ప్రతిష్టించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొదట వంద విగ్రహాలతో మొదలు పెట్టి ఇప్పుడు వెయ్యికి పైగా పంపిణీ చేస్తున్నా.
– రామకృష్ణరావు, పర్యావరణ అవార్డు గ్రహీత
గ్రామానికి ఒక వినాయకుడు..
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మట్టి వినాయకులను ప్రతిష్టి సకల జీవరాశులను కాపాడుకుందాం. గ్రామంలో ఒకే పెద్ద వినాయకుడిని ప్రతిష్టించి, ఇండ్లల్లోమట్టి వినాయకులను పూజిస్తే ఎంతో మేలు.
– ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు