పరిగి, ఆగస్టు 1 : నీలి విప్లవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో పెంపకానికి సంబంధించి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. ఈసారి చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ సంవత్సరం కోటి 20లక్షలు చేప పిల్లలు ఉచితంగా పంపిణీకి మత్స్య శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన చెరువుల్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మత్స్య శాఖ అధికారులు చేపడుతున్నారు. వర్షాలతో జిల్లాలోని 50శాతం చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి. మిగతా వాటిలోకి సైతం నీరు వచ్చి చేరింది. దీంతో త్వరగా చేప పిల్లలను వదిలితే మరింత ఎదుగుతాయని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 690 చెరువుల్లో ఈసారి ఉచితంగా చేప పిల్లలు వదలనున్నారు.
ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో..
జిల్లాలో సంవత్సరం పొడవునా నీరు ఉండే 10 ప్రాజెక్టులు, పెద్ద చెరువులను ఎంపిక చేయగా, వాటిలో 25లక్షలు పెద్ద చేప పిల్లలు వదులుతారు. జిల్లాలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు, కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టు, నందివాగు, కొంశెట్టిపల్లి చెరువు, శ్రీరాముల వారి ప్రాజెక్టు, ముద్దాయిపేట్ చిన్నవాగు, అల్లాపూర్ చెరువు, ఏర్పుమల్ల ప్రాజెక్టుల్లో సంవత్సరం పొడవునా నీరు ఉంటాయి. అందువల్ల వీటిలో 25లక్షలు 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవైన చేప పిల్లలను వదులుతారు. దీంతో చేప పిల్లల ఉత్పత్తితోపాటు వాటి ఎదుగుదల బాగుంటుంది. ఇకపోతే జిల్లాలో గుర్తించిన మరో 680 చెరువుల్లో 95లక్షలు 35 నుంచి 40 మిల్లీ మీటర్ల చేప పిల్లలను వదులుతారు. ఈ చెరువుల్లో సంవత్సరంలో 6 నుంచి 8 నెలల వరకు నీరు ఉంటుంది. వాటిలో చిన్న సైజులో ఉండే చేప పిల్లలు వదలడం జరుగుతుంది. చిన్న చెరువుల్లో హెక్టారు నీటి విస్తీర్ణంలో 3వేల చేప పిల్లలు, శాశ్వత నీటి వనరులో హెక్టారు నీటి విస్తీర్ణంలో 2వేల చేప పిల్లలు వదలడం జరుగుతుంది.
మోమిన్‌పేట్‌లో..
జిల్లాలోని మోమిన్‌పేట్‌లో ఈసారి సుమారు 25లక్షల చేప పిల్లల ఉత్పత్తికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ కేంద్రంలో 73లక్షలు స్పాన్ల ఉత్పత్తి చేసి వాటి ద్వారా రేరింగ్ చేయడంతో సుమారు 30 నుంచి 40శాతం వరకే చెరువుల్లో వదిలేందుకు అవసరమైన సైజులో చేప పిల్లలు ఉత్పత్తి అవుతాయి. 35 నుంచి 40 మిల్లీ మీటర్ల సైజులో సుమారు 25లక్షలు పైగా చేప పిల్లలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మిగతా 95లక్షలు చేప పిల్లల పంపిణీ కోసం ఇటీవల టెండర్లు పూర్తి చేశారు. 35 నుంచి 40 మిల్లీ మీటర్ల చేప పిల్లలకు ఒక్కోదానికి 0.37 పైసలు, 80 నుంచి 100 మిల్లీ మీటర్ల లక్ష చేప పిల్లలకు ఒక్కోదానికి రూ.1.10 ఖరారు చేసినట్లు తెలిపారు. చేప పిల్లలు రాగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
4వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 690 చెరువుల్లో చేప పిల్లలు వదలనుండగా వాటి పెంపకంతో 4వేల మత్స్యకారుల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లాలో 105 మత్స్యకారుల సంఘాలు ఉన్నాయి. వాటిలో 4వేల మంది సభ్యులు ఉన్నారు. చేపల పెంపకం ద్వారా సంబంధిత కుటుంబాలకు ఉపాధి లభించి లబ్ధి కలుగుతుంది. చేపల పెంపకంతోపాటు చేపలను మార్కెట్లకు తరలించేందుకు అవసరమైన వాహనాలు సైతం సరఫరా చేయడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి సర్కారు తోడ్పాటు అందజేస్తున్నది.
త్వరలో పంపిణీకి ఏర్పాట్లు
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈసారి కోటి 20లక్షల చేప పిల్లలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మోమిన్‌పేట్‌లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో 25లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేయాలని నిర్ణయించగా, మిగతా 95లక్షల చేప పిల్లలు కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తారు. త్వరలోనే చెరువులు, కుంటల్లో వేసేందుకు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు.
– సతీష్, జిల్లా ఇన్చార్జి మత్స్యశాఖ ఏడీ