కడ్తాల్, జూలై 22: పోస్టాఫీల్లో అందజేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రకాశ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మైసిగండి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ పోస్టాఫీస్‌ను, హైదరాబాద్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తాతో కలిసి ప్రకాశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తులసీరాంనాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకాశ్, విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్ సేవలను విస్తృత పరచడానికి కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పోస్టాఫీసుల్లో 307 రకాల సేవలు అందుబాటులోకి తీసువచ్చామని తెలిపారు. వివిధ బ్యాంక్ ఖాతాదారులు పోస్టాఫీస్ల్లో మొబైల్ ఏటీఎం ద్వారా డబ్బులను డ్రా చేసుకోవచ్చన్నారు. బాలికల కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో రూ.250తో ఖాతా తెరవాలని సూచించారు. హర్, హర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైనా జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో, పోస్టాఫీస్ల్లో నాణ్యమైన జాతీయ జెండాలను అందుబాటులో ఉంచామన్నారు. పోస్టాఫీస్‌లో ప్రతి ఒక్కరూ ఎస్బీ, ఆర్పీఎల్ ఖాతాలను తెరవాలని, బీమా సౌకర్యాలను పొందాలని తెలిపారు. అనంతరం గ్రామంలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసిన తపాలా శాఖ ఉన్నతాధికారులను శాలువా, పూలమాలతో నాయకులు సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, లోకేశ్‌నాయక్, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, హర్యానాయక్, హీరాసింగ్, అమృ, జవహర్లాల్, రాందాసు, సీతారాం, పుష్ప, తపాలా శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ మహ్మద్ జుబేర్, పోస్టుమాస్టర్ రాజశేఖర్, బ్రాంచ్ పీఎం రవీందర్, సిబ్బంది యాదయ్య, రాజేశ్, కుమార్, జంగయ్య పాల్గొన్నారు.