జిల్లాలో పదులసంఖ్యలో కూరగాయల నర్సరీల ఏర్పాటు
అందుబాటులో కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు
కొనుగోలుకు ప్రజల ఆసక్తి
ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 8: కూరగాయలు, పూలు, పండ్ల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. గతంలో రైతులు తమ భూముల్లో నారుపోసి తోటలు సాగు చేసేవారు. ప్రస్తుతం నర్సరీల్లో సిద్ధంగా ఉన్న నారును తీసుకెళ్లి సాగు చేస్తున్నారు. వీరికి తోడు పట్టణాల్లో మిద్దె తోటలు వేసేవారు సైతం భారీగా నారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నర్సరీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. సాధారణంగా ప్రతిరోజూ వంద, సీజన్లో 300 అమ్ముడవుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలతోపాటు కూరగాయలు కూడా చాలా ముఖ్యం. అందుకే రంగారెడ్డిజిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఏర్పడుతున్నది. ఇక్కడ ఇప్పటికే పలువురు ప్రైవేట్ నర్సరీలను ఏర్పాటు చేసి రైతులు, ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్క ల నారును విక్రయిస్తున్నారు. రూపాయికో మొక్క ను అమ్ముతుండగా.. నెల రోజుల్లో వాటి విక్రయా లు లక్షల్లో ఉంటున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజూ ఒక్కొక్క నర్సరీలో వంద వరకు మొక్కల నారును అమ్ముతుండగా.. సీజన్ సమయంలో మూడు వందల వరకు ఉంటున్నది. గతంలో కూరగాయలను సాగు చేయాలంటే రైతులు తమ పంట భూముల్లో కూరగాయల నారుపోసి అవి పెద్దవైన తర్వాత నాటి.. వాటి ద్వారా కూరగాయలను విక్రయించేవారు. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలామంది ప్రజలు తమ ఇండ్ల పరిసరాల్లో కూరగాయలను సాగుచేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాలతోపాటు డాబాలపై మట్టి కుండీలను ఏర్పా టు చేసి నారును విత్తి కూరగాయలను పెంచుతున్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల నర్సరీల నుంచి రూపాయికో మొక్కను చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చి పెంచుతున్నారు. నగర శివారులోని అధికశాతం ప్రజలు తమ ఇండ్ల ముందు, ఇండ్ల పైన ప్రత్యేక మట్టి కుండీలను ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు సాగుచేసుకుంటున్నారు.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
జిల్లాలో కూరగాయల నర్సరీలకు డిమాండ్ ఏర్పడటంతో ఔత్సాహికులు వీటిని అధికంగా ఏర్పాటుచేసి, స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యా చారం, అబ్దుల్లాపూర్మెట్, కందుకూరు, మహేశ్వరం, షాబాద్, షాద్నగర్, చేవెళ్లతో పాటు ఇతర మండలాల్లోనూ నర్సరీలను ఏర్పాటు చేశారు. కేవ లం ఎకరం వ్యవసాయ భూమిలో ఇరిగేషన్ ద్వారా నర్సరీలను ఏర్పాటు చేసి హైబ్రిడ్ రకానికి చెందిన కూరగాయలు, పూల మొక్కల నారును పెంచుతున్నారు. ఇందులో టమాట, బీరకాయ, వంకాయ, క్యాబేజీ, మిరపతోపాటు పండ్లు, పూల మొక్కల నారు ఉంటున్నది. ప్రత్యేకంగా ప్లాస్టిక్ కుండీల్లో వివిధ రకాల విత్తనాలను వేసి మొక్కలను పెంచుతున్నారు. ఇందుకోసం కొబ్బరిపీచుతోపాటు నల్లమట్టి, సేంద్రియ ఎరువులను వినియోగించడంతో విత్తనాలను నాటిన పది రోజుల్లోనే మొలకలు వస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో వారికి కూడా ఉపాధి లభిస్తున్నది.
అందుబాటులో రకరకాల మొక్కల నారు..
రైతులు గతంలో తమ వ్యవసా య పొలాల్లో కూరగాయలు, పూ ల పంటలను సాగుచేయాలంటే నెలరోజుల ముందుగానే విత్తనాలను తీసుకొచ్చి నారుపోసి మొలకలు వచ్చిన తర్వాత పంటలను సాగుచేసేవారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని ప్రతి మండలంలో రెండు నుంచి పది వరకు ప్రైవేటు నర్సరీలు ఏర్పాటు కావడంతో…అవసరమైన ప్రజ లు, రైతులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మంచిరకం మొక్కల నారును కొనుగోలు చేసి తమ వ్యవసాయ పొలాల్లో విత్తుతున్నారు. రైతులు సాగుచేసే కూరగాయలు వంకాయ, టమాట, మిరప, బెండకాయ, క్యాబేజీతోపాటు వివిధ రకాల పండ్లు, పూల మొక్కల నారు ఆయా నర్సరీల నుంచి కొనుగోలు చేసి నాటి రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు.