పరిగి, జూలై 19: వికారాబాద్ జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరేదెప్పుడో.. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ఊసెత్తడం లేదు. ఏటా రైల్వేబడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశపడినా నిరాశే మిగులుతున్నది. మూడుసార్లు సర్వే చేసినా అమలుకు నోచుకోకపోవడంపాటు బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని అటకెక్కించి ఆదమరిచింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరు వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం సైతం ఉత్తుత్తిదే అని తేలిపోయింది. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ పరిధిలో 122 కి.మీ మేర రైల్వేలైన్ నిర్మాణం పూర్తైతే సుమారు 40 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కలుగనున్నది.
కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదు. అనేక దశాబ్దాలుగా జిల్లావాసుల కలగా మిగిలిన వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణంపై ఎనిమిదేండ్లుగా ఏనాడు కూడా ఊసెత్తనే లేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే రైల్వేరంగం అభివృద్ధి చెం దిందనిచెప్పుకోవడం మినహా ఆచరణలో శూన్యమని చెప్పొచ్చు. కొన్నేండ్ల క్రితం వేసిన రైల్వేలైన్ మినహా బీజేపీ పాలనలో కొత్తగా జరిగిందేమీ లేదు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణంపై గతంలోనే అనేక సర్వేలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్ని రంగాల అభివృద్ధి ప్రధాని మోదీ సారథ్యంలో సాధ్యమని, ఇందులో భాగంగానే జిల్లాకు కూడా కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని జిల్లావాసులందరూ భావించారు. కానీ ఎనిమిదేండ్లు గడిచినా ఇప్పటివరకూ కొత్త రైల్వేలైన్ అంశం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీంతోపాటు వికారాబాద్, తాండూరుకు ఎంఎంటీఎస్ రైలు పొడిగింపు విషయం కూడా ఉచిత హామీగానే మిగిలిపోయింది.
40 గ్రామాలకు రైలు సదుపాయం…
ప్రతిపాదిత వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్‌ను నిర్మి స్తే సుమారు 40 గ్రామాల ప్రజలకు రైలులో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. వికారాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వేలైన్‌ను పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ పరిధిలో 122 కిలోమీటర్ల దూరం వరకు నిర్మించాల్సి ఉం టుంది. ఈ లైన్ నిర్మాణానికి ఇప్పటివరకు అధి కారులు మూడుసార్లు సర్వేను పూర్తి చేశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంతో హైదరాబాద్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ప్రజలకు రైలు సదుపాయంతోపాటు దూరం కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులపై వెళ్లే వారికి డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. వికారాబాద్, నారాయణపేట్ రెండు జిల్లాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుకానున్న ఈ కొత్త రైల్వేలైన్ నిర్మాణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రతి ఏడాది ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని ఆశిం చి.. నిరాశ చెందడం ప్రజల వంతవుతున్నది.
ఉచిత హామీగానే.. ఎంఎంటీఎస్ పొడిగింపు…
హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరు వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం కూడా ఉచిత హామీగానే మిగిలిపోయింది. రైలును పొడిగించాలని గత ఎనిమిదేండ్లుగా కేంద్రాన్ని పలుమార్లు కోరుతున్నా ఫలితం లేదు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి పలుమార్లు కేంద్రమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.. ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి నాన్చుతున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంలేదు. వికారాబాద్, తాండూరు రైల్వేస్టేషన్లను మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి
కాంగ్రెస్, బీజేపీ విధానాలతో పరిగి ప్రజల రైల్వేలైన్ కల నెరవేరడంలేదు. మేము తెస్తామంటే.. మేము తీసుకొస్తామని గొప్పలు చెప్పిన నాయకులు ఆ ఊసే ఎత్తడంలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నాయకు లు పరిగి ప్రజల కలను నెరవేర్చే దిశగా రాను న్న బడ్జెట్లో ఈ రైల్వేలైన్ నిర్మాణానికి నిధు లు కేటాయించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి.
–గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ దోమ మండలాధ్యక్షుడు