ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
పరిగి, మార్చి 7: నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ఆదర్శంగా ముం దుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసినది. మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నది. రాజకీయాల్లోనూ పురుషులతో సమానంగా రిజర్వేషన్లు కల్పించడంతో నేడు అత్యధికంగా మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవలో తరిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లను అమలు చేస్తూ వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నది. ఆడపిల్లల రక్షణ కో సం దేశంలోనే మొదటిసారిగా షీటీమ్స్‌ను ఏర్పాటు చేసి వారిని ఆకతాయిల బారి నుంచి సంరక్షిస్తున్నది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో..
పేదింటి ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. 2016లో ఈ పథకాలను ప్రారంభించి పేద యువతుల వివాహానికి రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం ఆ సాయాన్ని రూ.75 వేలకు, తర్వాత రూ. లక్షా116లకు పెంచారు. ఈ పథకాల కింద వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 28,182 మందికి ఆర్థిక సాయం అందింది. కల్యాణలక్ష్మి కింద 26,871 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 23,209 మందికి, షాదీముబారక్ కింద 5,969 దరఖాస్తులు అందగా 4,973 మందికి ప్రభు త్వం సాయాన్ని అందించింది. ఒక్కో కుటుంబంలో అక్కాచెల్లెళ్ల వివాహం జరిగినా ఇద్దరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల క్రింద ప్రభుత్వం సాయాన్ని అందించి ఆదుకుం టున్నది.
31,753 మందికి కేసీఆర్ కిట్లు..
ప్రభుత్వం పేదలకు సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటూనే ప్రసవాలు కూడా అక్కడే జరిగేలా ప్రోత్సహిస్తున్నది. సర్కారు దవాఖానల్లో ప్రసవం జరిగితే 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్లను అందజేస్తున్నది. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో 31,753 మందికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లను పంపిణీ చేసింది. మొదటి, రెండో కాన్పులకు మాత్రమే ఈ కిట్లను అందిస్తున్నది. దీంతోపాటు గర్భిణులను వైద్య పరీక్షల కోసం అమ్మ ఒడి వాహనాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకొచ్చి పరీక్షల తర్వాత వారిని ఇం టి వద్దకు చేర్చుతున్నారు. అలాగే సర్కారు దవాఖానల్లో ప్రసవం తర్వా త కూడా మాతాశిశువులను అమ్మ ఒడి వాహనాల్లో ఇంటివద్దకు తీసుకెళ్తున్నా రు. ఆడ శిశువు పుడితే రూ.13వేలు, మగ శిశువైతే రూ.12వేలు అందజేస్తుంది. ఈ కార్యక్రమం క్రింద జిల్లాలో ఇప్పటివరకు రూ. 31.06కోట్లను ప్రభుత్వం అందజేసింది.
పింఛన్లతో పేదలకు ఆసరా..
రూ.200 ఉన్న ఆసరా పింఛన్లను రూ.2,016కు పెంచడం ద్వారా సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలిచారు. అలాగే దివ్యాంగులకు రూ.500గా ఉన్న పింఛన్‌ను రూ.3,016కు పెంచారు. వికారాబాద్ జిల్లా పరిధిలో అన్ని రకాల పింఛన్లు 93,580 మందికి అందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.21.91 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నది. అందులో 46,097 మంది వితంతువులు, 4,503 మంది ఒంటరి మహిళలు, 29,098 మంది వృద్ధులు, 12,082 మం ది దివ్యాంగులున్నారు. గతంలో నిరాదరణకు గురైన వారందరూ ప్రస్తుతం గౌరవంగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకు వలె ఆదరిస్తున్నారని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా ఉద్యోగుల వేతనాల పెంపు..
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఇతర ఉద్యోగుల వేతనాలను పెంచిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్ల వేతనాలకు కూడా పెంచారు. దీంతో ప్రధాన అంగన్వాడీ కేంద్రం కార్యకర్తల వేతనాలు రూ.13,650, మినీ అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.7,800, ఆయాల వేతనాలు రూ.7,800లకు పెరిగాయి. జిల్లా పరిధిలో మెయిన్ అంగన్వాడీల కార్యకర్తలు -969 మంది ఉండగా, మినీ అంగన్వాడీల కార్యకర్తలు-138 మంది, 969 మంది ఆయాలకు 30శాతం వేతనాలు పెరిగాయి. వారితోపాటు జిల్లాలో పనిచేస్తున్న 713 ఆశ వర్కర్ల వేతనాలు కూడా రూ.7,500 నుంచి 9,750కు పెంచారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట
షాబాద్, మార్చి 7: సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఏడున్నరేండ్ల పాలనలో అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తున్నది. నిరుపేద తల్లిదండ్రులకు తమ కుమార్తె పెండ్లి భా రం కావొద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసి రూ.లక్షా 116 అందించి వారిని ఆదుకుంటున్నది. అంతేకాకుండా గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులైన వారికి ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్ క్రింద రూ.13 వేల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేస్తున్నది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీటీమ్స్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల నుంచి మహిళలను కాపాడుతున్నది. ఆసరా పథకం ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రతినెలా రూ.2016 అందించి ఆదుకుంటున్నది.