షాబాద్, మార్చి 7: క్షేత్రస్థాయి పర్యటనతో పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయి పర్యటనలు, గ్రామీణ స్థితిగతుల అధ్యయనంతోనే పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని, అప్పుడే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారని తెలిపారు. ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీస్ అధికారుల(25 మంది)శిక్షణా బృందం శిక్షణలో భాగంగా సోమవారం గ్రామ పర్యటన అధ్యయనం కోసం రంగారెడ్డి జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ వారితో మాట్లాడారు. మార్చి 7వ తేదీ నుంచి 12 వరకు ఆయా శిక్షణ అధికారుల బృందాలు గ్రామాల్లో పర్యటించి గ్రామ స్థాయిలో ప్రజల జీవన విధానం, వ్యవసాయం, నీటి వసతి, విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, యువత ఉపాధి తదితర అంశాలను అధ్యయనం చేస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు తదితరాలను పరిశీలిస్తారని తెలిపారు. గ్రామ స్థాయి అధ్యయనం ఆయా అధికారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పల్లెప్రకృతి వనం, గ్రామ పంచాయతీకి అందుతున్న నిధులు, రైతు సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, హరితహారం, విలేజ్ హెల్త్ ప్రొఫైల్, ఆసరా పింఛన్ పథకాలు, ఆయా కార్యక్రమాల అమలు తీరును సంక్షిప్తంగా వివరించారు. ఈజీఎస్‌లో చేపట్టిన పనులను, ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలను పరిశీలించవచ్చని సూచించారు. ఐపీఎస్, ఐఆర్ఏఎస్, ఐఎఫ్‌వోఎస్, ఐఆర్టీఎస్, ఐడీఎస్సీఇ, ఐఆర్/టీఏఫ్ఎస్ సర్వీసెస్‌కు చెందిన(25)మందిని ఐదు బృందాలుగా విభజించి, ఒక్కో బృందంలో ఐదు మందికి ఒక గ్రామాన్ని కేటాయించిన్నట్లు తెలిపారు. వీరికి కో ఆర్డినేట్ చేయడానికి ఒక్కో జిల్లా అధికారిని కేటాయించారు. డీఆర్డీవో ప్రభాకర్ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, సీపీవో ఓంప్రకాశ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి మోతి, గిరిజన సంక్షేమాధికారి రామేశ్వరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.