మన ఊరు.. మన బడితో కార్పొరేట్ స్థాయి విద్య
ప్రతి పైసాను అభివృద్ధికి వెచ్చించాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీ
షాద్‌నగర్‌టౌన్, మార్చి 7: ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులను విస్తృతంగా చేపట్టాలని ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మం డల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పనులతో వలసలు తగ్గాయన్నారు. ఉపాధి హామీ పనులతో గ్రామీణ ప్రాంతాల్లోని యువత సైతం ఉపాధి పొందుతున్నారన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని 47గ్రామ పంచాయతీల్లో పథకాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. మన ఊరు.. మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మన ఊరు …మన బడి కార్యక్రమంతో ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో విద్య అందనుందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి పైసాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల నీరు వృథా అవుతున్నాయని, వాటిని వృథాకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంటింటి నల్లాల మిషన్‌భగీరథ పైపుల కోసం తీసిన గుంతలు లోతుగా లేకపోవడంతో తరుచూ లీకేజీలు అవుతున్నాయని, వీటిని సరి చేయాలని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికారులను కోరారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎంపీటీసీలకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు సర్వసభ్య సమావేశానికి హాజరైతే అభివృద్ధిని మరింత సాధించవచ్చని ఎంపీటీసీలు అభిప్రాయపడ్డారు. సమావేశం లో వైస్ ఎంపీపీ మౌనిక, పీఏసీఎస్ చైర్మన్ బక్కనయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, ఎంపీవో కల్యాణి, తాసిల్దార్ గోపాల్, ఎంఈవో శంకర్‌రాథోడ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.