లైట్లు ఆర్పేసి అక్కడే గంటల తరబడి
జర్నీలోనూ సైరన్ మోగితే రైలు ఆగింది
ఇంటికొచ్చేందుకు ఆరు రోజులు పట్టింది
మెడిసిన్ విద్యార్థి కల్లూరి జయప్రతాప్
ఎట్టకేలకు తట్టిఅన్నారానికి చేరిక
హయత్‌నగర్ రూరల్, మార్చి 6: ‘కుయ్య్య్మంటూ సైరన్ మోగగానే బంకర్లలోకి పరుగులు తీశాం. లైట్లు ఆర్పేసి అందులోనే గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఉక్రెయిన్ నుంచి ఇంటికి చేరేందుకు ఆరు రోజులుపట్టింది’ అని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని హనుమాన్‌నగర్‌లో ఉంటున్న రామకృష్ణ కుమారుడు కల్లూరి జయప్రతాప్ తెలిపాడు. శనివా రం రాత్రి ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అతడు ఉక్రెయిన్‌లోని జపరోజియా స్టేట్‌లో మెడిసిన్ మూడో ఏడాది చదువుతున్నాడు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న వెంటనే ఇంటికి రావాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో గత నెల 24న టికెట్ బుక్ చేసినా విమానం రద్దు కావడంతో వచ్చేందుకు వీలుకాలేదు.
ఆ తర్వాత విమాన రాకపోకలు నిలిచిపోయి అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందు లను ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..
‘మేం ఉన్న ప్రాంతానికి యుద్ధం జరుగుతున్న కీవ్‌కు దాదాపు పది గంటల ప్రయాణం ఉంటుంది. మేం ఉంటున్న చోట ఎలాంటి యుద్ధం లేదు. కానీ, మాకు భయమేసింది. మా కాలేజీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వారిమి దాదాపు వెయ్యి మందికిపైగానే ఉంటాం. భారత్‌కు చెందిన విద్యార్థులు ఐదువేలకు పైగానే ఉంటారు. మా హాస్టల్లో తిండికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాకపోతే సైరన్ మోగగానే సమీపంలోని బంకర్లలోకి వెళ్లిపోవాలని కాలేజీ నిర్వాహకులు ముందుగానే మాకు సూచించారు. దీంతో సైరన్ మోగగానే సమీపంలోని బంకర్లలోకి వెళ్లి కూర్చునేవాళ్లం. లైట్లన్నీ ఆర్పేసి బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. గంటల తరబడి అలా చీకట్లలోనే గడపడం జరిగింది. స్నేహితులు తోడుగా ఉండటంతో కొంచెం ధైర్యంగా ఉండేది. తల్లిదం డ్రులు ఎప్పటికప్పుడు మాతో ఫోన్లో మాట్లాడు తూ ధైర్యం చెప్పారు.
అదే సమయంలో ఇండియన్ ఎంబసీ వారితోనూ మాట్లాడేది. యుద్ధ వాతావర ణం ఉన్నదని ముందు జాగ్రత్తగా పదిరోజులకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాం. అప్పటికే రేట్లు పెరిగిపోయాయి. వాటినే సరిపెట్టుకున్నాం. ఎట్టకేలకు గతనెల 28న జఫరోజియా నుంచి హంగేరీకి బయలుదేరాం. రైలులోని ఒక్కో బోగీలో దాదాపు 200 మంది కూర్చునే అవకాశం ఉండగా.. రెట్టింపునకు మించి విద్యార్థులం అందులో ఎక్కాం. రైలులో హంగేరీ సరిహద్దుకు వెళ్లేందుకే దాదాపు 32 గంటల సమయం పట్టింది. సైరన్ మోగినప్పుడు రైలు కూడా గంటల తరబడి ఆగిపోయేది. మళ్లీ చాలా సేపటికి బయలుదేరేది. హంగేరీకి వచ్చాక ఆ దేశస్తులు మాకు కడుపునిండా భోజనం పెట్టారు. అక్కడ ఇండియాకు వచ్చేందుకు ఇమ్మిగ్రేషన్ కోసం ఆరు గంటలపాటు లైన్లో నిలబడ్డాం. అక్కడి నుంచి హంగేరీ రాజధానికి రైలులో వచ్చి.. ఇండియ న్ ఎంబసీ సహకారంతో శనివారం ఢిల్లీకి చేరుకు న్నాం. అక్కడి నుంచి ఇంటికి రాత్రి వరకు చేరుకున్నా. తల్లిదండ్రులను చూశాక సంతోషం ఆపుకోలేకపోయా’ అని పేర్కొన్నాడు. తమ స్నేహితులు చాలామంది ఇంకా అక్కడి హాస్టళ్లలోనే చిక్కుకున్నారని తెలిపాడు. తమ చదువు మధ్యలోనే ఆగిపోయిందని, చదువు కొనసాగించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలన్నాడు.