పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు
రైతులు, పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దు
తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు
పెద్దేముల్, మార్చి 6: మండలంలోని ఆత్కూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరి స్తున్నట్లు గుర్తించినట్లు తాండూ రు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు తెలిపారు. గత గురువారం ఆత్కూర్ పంట పొలాల్లో ఓ పెంపుడు కుక్కను చిరుత పులి చంపి తిని ఆత్కూర్ అటవీ ప్రాంతంలో వదిలేసింది. దానిని గమనించిన కొంతమంది పశువుల కాపరులు అధికారులకు సమాచారం ఇవ్వగా … ఆదివారం స్థానికులతో కలిసి అధికారులు అక్కడికెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించి చిరుత పులి పాదముద్రలుగా గుర్తించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్రావు మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దు రాష్ట్రం నుంచి ఓ చిరుత పులి ఇందూరు ఫారెస్ట్ సెక్షన్లోకి వచ్చి ఉండొచ్చన్నారు. ఆత్కూర్ అటవీ ప్రాంతంలోని రైతులు, పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దని సూచించారు.
రైతులు తమ పొలాల వద్ద మంటలేసుకుని ఉండాలని, నీటిని అందుబాటులో ఉంచొద్దని, పులి సంచరిస్తున్న విషయాన్ని సమీప గ్రామాల ప్రజలకు సర్పంచ్ల ద్వారా చేరవేసినట్లు తెలిపారు. కాగా పులి సంచరిస్తున్న విషయం తెలుసుకుని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మమత, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.